
- ఈ వారంలోనే మొదటి విడతగా రూ.లక్ష జమ
- డబ్బుల్లేని లబ్ధిదారులకు డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలి దశలో భాగంగా జనవరి 26న 71 వేల మందికి ప్రభుత్వం ఇండ్ల మంజూరు పత్రాలు అందించింది. రీ వెరిఫికేషన్ లో 6 వేల మందిని అధికారులు అనర్హులుగా తేల్చి తొలగించారు. చివరికి 65వేల మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు 12వేల మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. బేస్ మెంట్ నిర్మాణంలో భాగంగా గుంతలు తీసి మట్టి, రాళ్లతో పూడ్చారు. మరో 1,200 మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నట్లు హౌసింగ్ డిపార్ట్మెంట్కు జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు నివేదిక ఇచ్చారు. ఉగాది పూర్తి కావడం, మంచి ముహుర్తాలు ఉండటం, వ్యవసాయ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇక ఇండ్ల నిర్మాణ పనులు మరింత ఊపందుకుంటాయని అధికారులు చెప్తున్నారు.
ఈ వారంలోనే డబ్బులు రిలీజ్!
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 4 దశల్లో రూ.5 లక్షలను లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. తొలి దశలో బేస్ మెంట్ కంప్లీట్ అయ్యాక లక్ష రూపాయలు ఇవ్వాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది బేస్మెంట్ పనులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల చివరికల్లా మరో వెయ్యి మంది లబ్ధిదారులు పునాది పనులు పూర్తి చేస్తారని అధికారులు చెప్తున్నారు. బేస్మెంట్ కంప్లీట్ చేసిన అందరికి మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వారంలోనే డబ్బులు రిలీజ్ అవుతాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ నిధులన్నీ జిల్లాల ట్రెజరీల్లో ఉంటాయి.
కొందరి వద్ద డబ్బుల్లేక ప్రారంభం కాని పనులు
లబ్ధిదారుల్లో భూమి లేని కూలీలు, దివ్యాంగులు, వితంతువులే ఎక్కువ మంది ఉన్నారు. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు డబ్బుల్లేవని లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయాన్ని హౌసింగ్ డీఈ, ఏఈలు, ఎంపీడీవోలు ఆయా జిల్లాల కలెక్టర్లకు వివరించారు. లబ్ధిదారుల సమస్యను కలెక్టర్లు హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బేస్మెంట్ పూర్తి చేయకుండానే లక్ష రూపాయలు ఇస్తే మిగిలినవారందరూ ఇలాగే డిమాండ్ చేస్తారని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల నుంచి లబ్ధిదారులకు రూ.1లక్ష అందించాలని హౌసింగ్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ డబ్బులతో బేస్మెంట్ పూర్తి చేసుకోవాలని, తర్వాత ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలను తిరిగి మహిళా సంఘానికి చెల్లించాలని వివరించారు.
ఇక నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపిక
ఫస్ట్ ఫేజ్‌లో మండలాని ఒక గ్రామాన్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక నుంచి మండలంలోని అన్ని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఉన్నతాధికారులు కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటికే ప్రాథమికంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవ ర్గానికి 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ.. వాటిని రీ వెరిఫికేషన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అర్హులకే స్కీమ్ వర్తింపజేయాలని ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ముందు నుంచి చెప్తున్నారు. లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల్లో వెల్లడించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కలెక్టర్లు, ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
వచ్చే 3 నెలలు పనులు వేగవంతం
రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరుకు వడ్ల అమ్మకం, గడ్డి తోలడం, మిర్చి, పత్తి పంట పనులు పూర్తవుతాయి. వచ్చే 3 నెలల దాకా గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉండవు. కూలీల కొరత కూడా ఉండదు. ఇసుక కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వమే ఫ్రీగా సప్లై చేస్తున్నది. దీంతో పనులు మరింత ఊపందుకుంటాయి. జూన్ కల్లా సుమారు 45వేల ఇండ్ల బేస్‌మెంట్‌తో పాటు గోడలు కట్టే పనులు కూడా పూర్తయ్యేలా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఫాలోఅప్ చేయాలని ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కలెక్టర్లు, హౌసింగ్ పీడీలు, డీఈ, ఏఈలు, ఎంపీడీవోలకు హౌసింగ్ సెక్రటరీ, ఎండీలు ఆదేశించారు.