- స్పీడ్‌గా భూపాలపల్లి కలెక్టరేట్ నిర్మాణ పనులు
- వచ్చే నెల 8న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఓపెనింగ్
- రెండు రోజుల్లో సివిల్ వర్క్స్ కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఆదేశం
- జిల్లా ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగింత
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయడంపై ఆఫీసర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే నెల 8న సీఎం కేసీఆర్ భూపాలపల్లిలో పర్యటించి కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. ఆ లోగా పనులన్నీ కంప్లీట్ చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా వివిధ పనులపై జిల్లా స్థాయి ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు.
ఆరేళ్ల కింద ప్రారంభమైన పనులు
భూపాలపల్లి కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మాణ పనులను 2017లో ప్రారంభించారు. రూ.59 కోట్లతో సివిల్ వర్క్‌లు చేస్తున్నారు. గత ఆరేళ్లుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున కలెక్టరేట్‌ను ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గత ఆరు నెలలుగా పనులను స్పీడప్ చేసింది. ఇప్పటికే మూండత్తుల బిల్డింగ్ పూర్తి కాగా, కలర్స్ కూడా వేశారు.
ప్రస్తుతం ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. నేషనల్ హైవే నుంచి కొత్త కలెక్టరేట్ ఎంట్రెన్స్ వరకు రోడ్డు వేశారు. కలెక్టరేట్ బిల్డింగ్ ఎంట్రన్స్ వద్ద సుందరీకరణ కోసం పూల మొక్కలు నాటడం, గార్డెనింగ్ పనులు చేస్తున్నారు. సీఎం పర్యటన సందర్భంగా కలెక్టరేట్ వెనుక హెలీప్యాడ్‌ను నిర్మిస్తున్నారు. వివిధ శాఖల ఇంజినీర్లు, ఆఫీసర్లతో పాటు ప్రతి రోజు 250 మంది కూలీలతో పనులు చేస్తున్నారు.
జిల్లా స్థాయి ఆఫీసర్లకు బాధ్యతలు
కొత్త కలెక్టరేట్ బిల్డింగ్‌ను వచ్చే నెల 8న ఓపెన్ చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సైతం సీఎం కేసీఆర్‌ను కలిసి కలెక్టరేట్ ఓపెనింగ్ చర్చించడంతో సీఎం పర్యటన కూడా ఖరారైంది. దీంతో కేసీఆర్ వచ్చేలోగా పనులన్నీ కంప్లీట్ చేసేందుకు కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నెలాఖరులోగా సివిల్ వర్క్‌లు కంప్లీట్ చేయాలని ఆదేశించడంతో పాటు, సీఎం టూర్ సందర్భంగా చేపట్టబోయే పనుల బాధ్యతలను వివిధ శాఖల ఆఫీసర్లకు అప్పగించారు.
కలెక్టరేట్ ఓపెనింగ్‌కు సంబంధించి నోడల్ ఆఫీసర్‌గా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లును నియమించారు. అలాగే కలెక్టరేట్‌లో గార్డెనింగ్ పనుల కోసం డీఆర్డీవో పురుషోత్తం, హార్టికల్చర్ ఆఫీసర్ సంజీవయ్య, గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ పనులు పూర్తి చేసి డెకరేట్ చేసే బాధ్యతలను జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీవీహెచ్‌వో రంగరావు, మీటింగ్ హాల్, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మినిస్టర్ చాంబర్స్ వర్క్ కంప్లీట్ చేయడం, డెకరేషన్ బాధ్యతలను ఫిషరీస్ ఆఫీసర్ అవినాశ్, డిప్యూటీ సీఈవో రఘువరణ్‌కు అప్పగించారు.
అలాగే అన్ని రూముల్లో ఫర్మిచర్ ఏర్పాటు బాధ్యతలను సీఈవో శామ్యూల్‌కు, శానిటేషన్ వర్క్‌ను డీపీవో ఆశలత, ఫొటోస్, అవుట్ సైడ్ డెకరేషన్ డ్యూటీని డీపీఆర్‌వో శ్రీధర్, డీపీవో సుధీర్‌కుమార్, ఇంటీరియర్ డెకరేషన్ బాధ్యతలను కలెక్టరేట్ ఏవో మహేశ్‌కు అప్పగించారు. సీఎం కేసీఆర్ పర్యటన పూర్తయ్యేంతవరకు వీరంతా ఈ విధుల్లోనే ఉండనున్నారు. కలెక్టరేట్ పనులు, సీఎం కేసీఆర్ టూర్‌పై ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం కలెక్టర్ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు..