నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి 

తుంగతుర్తి , వెలుగు : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో నిర్మాణ పనులు జూన్ లోపు పూర్తిచేయాలని కలెక్టర్ వెంకట్​రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో అమ్మ ఆదర్శ పాఠశాల, తిరుమలగిరిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్​వంటి మౌలిక వసతులు, మరమ్మతు పనులు పూర్తిచేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

తిరుమలగిరిలోని నెల్లిబండ తండా గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట జాజిరెడ్డిగూడెం తహసీల్దార్ జైశ్రీనివాసులు, కమిషనర్ రామ్ దుర్గారెడ్డి, ఎంపీడీవో లాజర్, ఎంఈవో శాంతయ్య, ఏఈ రంగారావు, ప్రధానోపాధ్యాయుడు వెంకన్న, అధికారులు ఉన్నారు. 

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి 

తుంగతుర్తి, వెలుగు : రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ వెంకట్​రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుమలగిరి మార్కెట్ యార్డును కలెక్టర్​ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీధర్, డీఎస్ వో పుల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ జాన్ మొహమ్మద్, కమిషనర్లు నర్సింహారెడ్డి, సోమేశ్​తదితరులు ఉన్నారు.