- కొత్త బిల్డింగులు కడితే.. కౌన్సిలర్లు దిగుతుండ్రు
- సెట్ బ్యాక్ లేదంటూ వేధింపులు.. డబ్బులు ఇస్తే సైలెంట్
- ఇంటి ముందు కంకర, ఇసుక కుప్పలు పోసినా వాలిపోతున్నరు
- కౌన్సిలర్ల కనుసన్నల్లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు
జగిత్యాల, వెలుగు: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు.. అధికార పార్టీ కౌన్సిలర్ల కనుసన్నుల్లో పనిచేస్తున్నట్లు అరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు కంకర, ఇసుక, కుప్పలు పోస్తే చాలు కౌన్సిలర్లు వచ్చి వేధిస్తున్నారని నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు.
కంకర, ఇసుక కుప్పలు పోస్తే కౌన్సిలర్లు
జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు కొరుట్ల, మెట్పల్లి బల్దియాల్లో కొందరు కౌన్సిలర్లు నిర్మాణాదారులను మామూళ్ల కోసం తీవ్ర ఇబ్బంది పెడుతున్నారనే అరోపణలు ఉన్నాయి. కొందరు కౌన్సిలర్లు ల్యాండ్ కొనుగోలు దగ్గరి నుంచి పర్మిషన్, కరెంట్ మీటర్ వరకు ఒక్కో దానికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. వారి వార్డుల్లో ఎక్కడ భూమి పూజ చేసి ఇసుక, కంకర కుప్పలు పోస్తే చాలు అక్కడ వాలిపోవడం పరిపాటిగా మారింది. ఏవరైనా నేరుగా పర్మిషన్ తీసుకుని, రూల్స్ ప్రకారం నిర్మాణం చేపట్టినా ఏదో ఒక కారణంతో స్థానికులతో బల్దియా ఆఫీసర్లకు ఫిర్యాదు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారులపై విమర్శలెన్నో..
బల్దియాకు చెందిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయా బల్దియాల డెవలప్మెంట్ కోసం రూపొందించి మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లే తూట్లు పొడుస్తున్నారు. పర్మిషన్ అన్ లైన్ కావడంతో రూల్ ప్రకారమే పర్మిషన్ ఇస్తున్నారు. కానీ పర్మిషన్ లో అప్రూవల్ అయినా ప్లాన్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఎన్ఫోర్స్ మెంట్ నోటీస్ లో పెట్టి చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఇంటి యజమానులు.. కౌన్సిలర్లు ఇచ్చే మామూళ్ల మత్తులో ఎన్ఫోర్స్ మెంట్ వరకు తీసుకువెళ్లడం లేదని తెలుస్తోంది.
ఫిర్యాదులెన్నో
జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి బల్దియాలతోపాటు కొత్తగా ఏర్పాటైన రాయికల్, ధర్మపురి బల్దియాల్లో ఒక్కోచోట నెలకు సుమారు 30పైన పర్మిషన్లు మంజూరవుతున్నాయి. వాటిలో 25 నిర్మాణాలకుపైగా రూల్స్ కు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రూల్స్ పాటించకుండా..
జగిత్యాల రాజీవ్ బైపాస్ రోడ్డులో ఓ ప్రైవేట్ స్కూల్ పక్కన బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. ఈ బిల్డింగ్ రోడ్డు సెంటర్ నుంచి సుమారు 45 ఫీట్లకు పైగా సెట్ బ్యాక్ తీసుకుని చేపట్టాలి. కానీ కనీసం 35 ఫీట్లు కూడా తీసుకోకుండా రోడ్డు వరకు చేపడుతున్నారు. స్లాబ్నిర్మాణం జరిగినా ప్లానింగ్ ఆఫీసర్లు అటూ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కొరుట్ల పట్టణంలోని రాంనగర్ లో ఓ కౌన్సిలర్ రూల్స్ విరుద్ధంగా సెట్ బ్యాక్ లేకుండా కమర్షియల్ షెటర్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్ సీసీ రోడ్డు వరకు నిర్మించడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో కూల్చివేయాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మార్కు చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం తిరిగి నిర్మాణం కొనసాతోంది.
‘జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడకు చెందిన లింగారెడ్డి తను కొనుక్కున్న 188 గజాల్లో పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. గృహ ప్రవేశం కూడా జరిగింది. అయితే శనివారం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఎన్ఫోర్స్మెంట్ టీం వచ్చి సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేపట్టారని, జేసీబీతో కూల్చేందుకు యత్నించారు. ఇంటి సభ్యులు జేసీబీని అడ్డుకోవడంతో ఆఫీసర్లకు, వారికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సెట్ బ్యాక్ లేనందుకు రూ.3 లక్షలు ఇవ్వాలని కౌన్సిలర్ కొడుకు డిమాండ్ చేశాడని, రూ.50 వేలు మీడియేటర్ కు ఇచ్చి పంపినట్లు తెలిపారు. మిగిలిన అమౌంట్ ఇవ్వకపోవడంతో బల్దియా ఆఫీసర్లకు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్నారని అడిగే ఆఫీసర్లు.. ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు ఎందుకు రాలేదని, పూర్తయ్యాక వచ్చి ఎందుకు వేధిస్తున్నారని విమర్శిస్తున్నారు. బల్దియా రూల్స్ ను అడ్డం పెట్టుకుని ఆఫీసర్లకు అమ్యామ్యాలు ఇస్తూ కొందరు కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు తెర లేపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు