- వీల్ చైర్ నుంచి కింద పడేసినందుకు రూ.6.5 లక్షలు కట్టండి
- ఎల్వీ ప్రసాద్ఆస్పత్రికి వినియోగదారుల ఫోరం ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ కు రాష్ట్ర వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. వీల్ చైర్ నుంచి కింద పడేసినందుకు బాధితుడికి రూ.6.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కరీంనగర్ లోని రాంనగర్ కు చెందిన మైన నారాయణ 2015, డిసెంబర్ 30న హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ కు కంటి పరీక్షల కోసం వచ్చాడు. అతడిని సిబ్బంది వీల్ చైర్ లో తీసుకువెళ్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించగా కింద పడ్డాడు.
దీంతో కాలి ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. అతడు సన్ షైన్ హాస్పిటల్ లో చికిత్స తీసుకోగా రూ.1.48 లక్షలు ఖర్చయింది. ఆ మొత్తాన్ని చెల్లించాలని బాధితుడు ఎల్వీ ప్రసాద్ మేనేజ్ మెంట్ ను సంప్రదించగా ఒప్పుకోలేదు. దీంతో జిల్లా వినియోగదారుల ఫోరం, రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఫోరం అన్ని ఆధారాలు పరిశీలించి చికిత్సకు అయిన రూ.1.48 లక్షలకు ఏడాదికి 18% వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.
పరిహారంగా రూ.2 లక్షలు, ఖర్చులకు రూ.5 వేలు, మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.50 వేలు ఇవ్వాలని, సమయాన్ని వృథా చేసినందుకు కమిషన్ కు రూ.10 వేలు కట్టాలని ఆస్పత్రికి ఆర్డర్ ఇచ్చింది. మొత్తంగా రూ.6.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.