హైదరాబాద్, వెలుగు: ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు మండిపోతున్నాడు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మంచినీటి వినియోగం బాగా పెరిగింది. గతేడాది వేసవిలో అత్యధికంగా 550 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నీటిని వాటర్ బోర్డు సప్లై చేయగా, ఈసారి 570 ఎంజీడీల నీటిని సప్లై చేస్తున్నామని వాటర్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కు సరిపడా సప్లయ్ చేస్తున్నామని అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవల్లో పరిస్థితి వేరేలా ఉంది. అనేక కాలనీల్లో నీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు.
డైలీ వందల్లో ఫిర్యాదులు
హైదరాబాద్‌లో సరిపడా నీరు సరఫరా కాకపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. నీళ్లు ఎప్పుడొస్తాయోనని నల్లాల వద్ద నిరీక్షిస్తున్నారు. కొన్ని కాలనీలకు వాటర్‌బోర్డు ట్యాంకర్లు రాగానే నీటి కోసం జనం ఎగబడుతున్నారు. కొండాపూర్, బోరబండ, గచ్చిబౌలి, మియాపూర్, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, నిజాంపేట, మన్సూరాబాద్, మౌలాలి, బహదూర్ పురా, సీతాఫల్ మండి, బండ్లగూడ జాగీర్, మూసాపేటతదితర ప్రాంతాల్లో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నట్లు అక్కడి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. బోరబండలోని బాబాసాయిల నగర్లో నెలకు 8 సార్లు మాత్రమే నీరు సరఫరా అవుతోందని షేక్ ఫదీద్ అనే సిజిజన్ వాటర్బోర్డ్కు ట్వీట్ చేశాడు. ఫిర్జాదీగూడలో నాలుగు రోజులకోసారి వస్తున్నాయని, నాలుగు నెలలుగా ఇదే సమస్య ఉందని మురళి అనే మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇలా ప్రతిరోజు వాటర్‌బోర్డుకు వందల్లో ఫిర్యాదులు వస్తున్నాయి.
వెంటాడుతున్న లోప్రెషర్ సమస్య
నీళ్లు ఎప్పుడు వస్తాయో కరెక్ట్ టైమ్ లేకపోవడం, సప్లై జరుగుతున్న సమయంలో లో ప్రెషర్‌తో రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మోటార్లు పెట్టకపోతే నీళ్లు సరిగా రావడం లేదని, దీంతో నల్లాలకు మోటార్లు పెట్టాల్సి వస్తున్నదని చెచెబుతున్నారు. లో ప్రెషర్ వస్తున్న ప్రాంతాలపై అధికారులు దృష్టిపెట్టడం లేదు. సమస్య తీవ్రమైతే తప్ప బూస్టర్లను ఏర్పాటు
చేయడం లేదు.
అసెంబ్లీ, కౌన్సిల్లలో చర్చ
ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో సిటీలోని నీటి సమస్యపై ప్రభుత్వాన్ని ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. వేసవికి ముందు జరిగిన బడ్జెట్సమావేశాల్లోనూ మలక్ పేట ఎమ్మెల్యే అబ్దుల్లా నీటి సమస్యపై ప్రశ్న లేవనెత్తారు. తమ నియోజకంవర్గంలో నీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారని, వాటర్ బోర్డు సరిగ్గా సప్లై చేయడం లేదని చెప్పారు. రానున్న రోజుల్లో సమస్య లేకుండా చూడాలని కోరారు. మరికొందరు కూడా ఇదే అంశంపై మాట్లాడారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లోనూ కార్పొరేటర్లు నీటి సమస్యలపై ప్రశ్నిస్తున్నప్పటికీ వాటర్బోర్డ్ అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. దీనిపై కార్పొరేటర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.