
- అక్రమాలు జరిగాయని ఆరోపణలు
వనపర్తి, వెలుగు: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో కాంటాక్టు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్, నేషనల్ క్వాలిటీ ఆఫీసర్, వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ పోస్టులను కాంటాక్టు పద్దతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆయా పోస్టులకు 500 దాకా అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఎంపికైన అభ్యర్థులు మొదటి లిస్టులో ఒక ర్యాంకులో ఉండగా, ఈ నెల మొదటి వారంలో ప్రకటించిన లాస్ట్ లిస్టులో మెరుగైన ర్యాంకుల్లో చేర్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పలువురు అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్‌గా కాంటాక్టు పద్దతిలో పని చేసే వారిని, రెగ్యులర్ సీనియారిటీ ఉన్న వారిని కాదని ప్రమోషన్ పోస్టుల్లోకి తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా తీసుకున్న ఇద్దరు కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల, పానగల్ మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ నేత అక్రమాలు జరిగినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. మరోసారి పరిశీలించాకే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అలాగే ఉద్యోగాల కోసం కొందరు ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో చదివినట్లు ఫేక్ సర్టిఫికెట్లు జత చేసి ఎంపికైనట్లు ఆరోపణలున్నాయి.
ఫిర్యాదు చేస్తే చర్యలు..
కాంటాక్టు పోస్టుల భర్తీలో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టినట్లు ఫిర్యాదు వస్తే, వాటిని యూనివర్సీటీలకు పంపిస్తామని.. నకిలీవని తేలితే వారిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో శ్రీనివాసులు తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పోస్టుల ఎంపిక పారదర్శకంగా వ్యవహరించామని చెప్పారు.