- మృతుల్లో దంపతులు, ఆటోడ్రైవర్
- ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ప్రమాదం
ఏటూరునాగారం, వెలుగు : ఆటోను ఎదురుగా వచ్చిన కంటెయినర్ ఢీకొట్టడంతో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో శనివారం రాత్రి జరిగింది. వాజేడు మండల కేంద్రానికి చెందిన కాకర్లపూడి సత్యనారాయణ రాజు (77) అతడి భార్య సత్యవతి(70) తమ కూతురు అనితను వైజాగ్ బస్సు ఎక్కించేందుకు రాత్రి 7 గంటలకు ఆటోలో ఏటూరునాగారం వస్తున్నారు.
మండల కేంద్రానికి సమీపంలోని రొయ్యూరు వద్దకు రాగానే చత్తీస్‌గఢ్ వైపు వెళ్తున్న కంటెయినర్ ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనారాయణ రాజు, సత్యవతి దంపతులతో పాటు ఆటో డ్రైవర్ తలండి నాగరాజు (22) స్పాట్‌లోనే చనిపోయారు. సత్యనారాయణరాజు కూతురు అనితతో పాటు మరో ప్రయాణికుడు పెనుమల్ల అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో గాయపడిన వారిని మండల కేంద్రంలోని సీహెచ్‌సీకి తరలించారు. అనిత పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఆమెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఆటోను ఢీ కొట్టి ఆగకుండా చత్తీస్‌గఢ్ వైపు వెళ్తున్న కంటెయినర్‌ను వాజేడు మండలం జగన్నాథపురం వద్ద స్థానికులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏటూరునాగారం పోలీసులు తెలిపారు.