కాటేదాన్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం.. ఒకరి పరిస్థితి విషమం

కాటేదాన్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం.. ఒకరి పరిస్థితి విషమం

రంగారెడ్డి : రాజేంద్రనగర్ కాటేదాన్ రవి ఫుడ్స్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో జనాల మీదకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

కాటేదాన్ లోని రవి ఫుడ్స్ యూనిట్ 2 లోపల కంటైనర్ ను డ్రైవర్ పార్క్ చేయడం బ్రేకులు ఫెయిలవడంతో బయటకు దూసుకొచ్చింది. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. కంటైనర్, బస్సు మధ్య నలిగి బస్సులో ప్రయాణిస్తున్న జ్ఞానేశ్వర్ అనే డ్రైవర్ కుడి చేయి నుజ్జునుజ్జయింది. అతనితో పాటు మరో మహిళకు తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. 

భారీ కంటైనర్ స్పీడ్ గా వెనక్కి రావడంతో జనం భయంతో తమ వాహనాలు వదిలి దూరంగా పారిపోయారు. ఘటన అనంతరం కంటైనర్ డ్రైవర్ దాన్ని అక్కడే వదలి పారిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.