ప్రాణాలను నిలపాల్సిన ఆహారమే నేడు మన ప్రాణాన్ని తోడేస్తున్నది. ఆహార భద్రత మనకు హక్కుగా సంక్రమించినప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం పొందే హక్కు మాత్రం అందడం లేదు. కలుషితమైన, నాసిరకమైన, విషరసాయనాలు కలిసిన ఆహారం భుజించడం ద్వారా ప్రతి సంవత్సరం 60 కోట్లమంది అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రతి పది మందిలో ఒకరు ఆహారం తీసుకున్న వెంటనే అస్వస్థులు అవుతున్నారని, ప్రతి సంవత్సరం 42,000 మంది పెద్దలు, 1,25,000 మంది 5 సంవత్సరాలలోపు పిల్లలు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో, గురుకులాలు, మధ్యాహ్న భోజన పాఠశాలల్లో కలుషిత ఆహారం బారినపడి విద్యార్థులు ఆసుపత్రులలో చేరిన సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. పేరుగాంచిన హోటళ్లలోనూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే ఆహారంలోనూ విశ్వవిద్యాలయాల హాస్టల్లో కూడా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని ఆహారం తిని ప్రాణాలు గాలిలో కలుస్తున్న ఉదంతాలు చూస్తూ ఉన్నాం.
వృథా అవుతున్న ఆహారం
2022 – 23 సంవత్సరంలో భారతదేశం 329.7 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసింది. వరి, గోధుమలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం రెండవ స్థానంలో ఉంది. కానీ, సరైన ఆహార వ్యవస్థలు లేక 30 నుంచి 40% ఆహారం వృథా అవుతున్నదని, తలసరి ఆహార వృథా 50 కేజీలుగా ఉందని fssai,UNFAO నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రతి సంవత్సరం దేశంలో వృథా అవుతున్న 70 మిలియన్ టన్నుల ఆహారం బిహార్ రాష్ట్రానికి సరిపోయేంతగా ఉండటం గమనార్హం. దేశంలో సగటు ఆయుర్దాయం 69 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ చైనాలో 76 గాను, అమెరికాలో 79 గాను ఉంది. కల్తీ ఆహారం వలన ఆయు ప్రమాణం పెరగడం లేదు.
అమలు నామమాత్రం
మన దేశం ఆహార ఉత్పత్తిలో మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ సరైన ఆహార వ్యవస్థల నిర్వహణలో విఫలమవుతున్నాం. ఆహార ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్, నిల్వ, వినియోగం, విలువ జోడించడం తదితర ప్రక్రియలు నిర్వహణలో అమలులో ఉన్న భద్రతా ప్రమాణాల అమలు జరగడం లేదు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న" ఆహార భద్రతా, ప్రామాణికతల సాధికార సంస్థ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ ఆహార భద్రతా ప్రమాణాల అమలు, ఆహార విశ్లేషణ, నీటి నాణ్యత పర్యవేక్షణ, చేస్తూ ఉన్నాయి. ఆహార శాంపిళ్లను పరీక్షించి 14 రోజుల్లో నివేదికలు ఇస్తున్నాయి. ప్రమాణాలను ఉల్లంఘించినట్లయితే రూ. లక్ష జరిమానా విధించడం, జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ఆహార భద్రత, ప్రమాణాలు, కలుషితాల నియంత్రణకు చట్టాలు, సంస్థలు ఉన్నప్పటికీ వీటి అమలు నామ మాత్రంగా జరుగుతూ ఉంది. పర్యవేక్షణ చేసేవారు లేకపోవడం.. ఉన్నా అవినీతి వల్ల, చూసి చూడనట్లు వదిలేయడం వల్ల వ్యాపారులు ఆహారం కలుషితం చేసి ప్రజల ప్రాణాలను హరిస్తూనే ఉన్నారు.
చట్టాలు చేస్తే సరిపోదు
కేవలం భద్రతా ప్రమాణాలను చట్టంలో పొందుపరిస్తే సరిపోదు. వాటి అమలుకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించి, అమలు జరుగుతున్న తీరును పర్యవేక్షించాలి. ప్రమాణాలు పాటించకుండా ప్రజల మరణాలకు కారణమవుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. వీరిపై నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేయడంతోపాటు, జరిమానా, శిక్షలను పెంచాలి . ఆహార ఉత్పత్తి విక్రయానికి వీధి వ్యాపారులకు, హోటళ్లకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ తప్పనిసరి చేయాలి. అదేవిధంగా ఆహార భద్రత అధికారులను తగిన సంఖ్యలో నియమించి తరచూ ప్రత్యేక డ్రైవులు నిర్వహించి శాంపిళ్లు సేకరించి పరీక్షించేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలి. ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి, రవాణా, నిల్వ, చేయబడింది అనే ఒక సర్టిఫికెట్ ను ఆహార విక్రేతలు తమ ఆహారంతోపాటు ఇచ్చేలా చేయాలి. ఆహారంలో కలుపుతూ ఉన్న కృత్రిమ రసాయనిక రంగులు, రుచులు, ప్రెజర్వేటివ్లను నిషేధించాలి. చికెన్, మాంసం, కోడిగుడ్లకు ప్యాకింగ్ లేబులింగ్ తప్పనిసరి చేయాలి. చికెన్ ఉత్పత్తిలో వాడుతున్న యాంటీబయోటిక్స్, గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లను నిషేధించాలి.
నిఘా పెరగాలి
తనిఖీ అధికారుల అవినీతిని ప్రధానంగా నిరోధించే పారదర్శక తనిఖీ వ్యవస్థలను తీసుకురావాలి. అపరిశుభ్రమైన పాత్రలు, ప్లాస్టిక్ పాత్రలు, నిల్వ చేయడం వెజ్ పదార్థాలు, నాన్ వెజ్ ఒకే రిఫ్రిజిరేటర్ లో నిలువ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉత్పత్తి ముడి సరుకుల రోజువారి వినియోగ రికార్డులు నిర్వహించాలి. FSSAI లోగో, తయారీ వివరాలు పెద్ద అక్షరాలలో ముద్రించాలి. గ్లోవ్స్ ధరించకుండా బేర్ హ్యాండ్స్‌తో ఆహారాన్ని తయారు చేయడం, వడ్డించడం, భద్రతా ప్రమాణాల ప్రకారం లేకపోవడం వంటి వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి నివారించే యంత్రాంగాన్ని పటిష్టంగా తయారు చేయాలి.ప్రజల్లో ఆహారం పట్ల చైతన్యం కోసం టీవీలు, పత్రికల్లో తరచూ ప్రకటనలు ఇవ్వడం ద్వారా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆహారం ఆకలి తీర్చుకోవడానికే కాదు. శరీరం, మనసు ఆరోగ్యానికి సంబంధించింది. ఆహారం భద్రమైనది కాకపోతే...అది ఆహారమే కాదు అన్న చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలి.
స్ట్రీట్ ఫుడ్‌పై కాలుష్య ప్రభావం
విపరీతమైన కాలుష్యం ఉండే రోడ్ల పక్కన దుమ్ము, ధూళి పడుతూ ఉంటే ఇడ్లీ, దోశ , జిలేబి, పానీపూరి లాంటి ఆహారాన్ని తయారుచేసి విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ పాత్రలలో తయారీ, నిల్వ, ప్లాస్టిక్ కవర్లలో నిల్వ, అపరిశుభ్ర నీటిని వినియోగించడం, కల్తీ పిండి, కల్తీ మసాలాలు, కల్తీ నూనెలు, నిల్వ ఆహారానికి రసాయనాలు కలిపి వేడి చేసి విక్రయించి ప్రజల మరణాలకు ఆహార విక్రేతలు కారణమవుతున్నారు.
- తండా ప్రభాకర్ గౌడ్, సోషల్ ఎనలిస్ట్