హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!

హైకోర్టు వద్దన్నా.. రాత్రికి రాత్రే రోడ్డేశారు!
  • మెహిదీపట్నంలో  జీహెచ్ఎంసీ అధికారుల నిర్వాకం
  • పూర్తయిన రోడ్డును మూసేసిన కోర్టు..రూ.13 లక్షలు వృథా!
  • అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు..
  • తీర్పు అనుకూలంగా రాకపోతే పైసలన్నీ పోయినట్టే 

మెహిదీపట్నం, వెలుగు: జీహెచ్ఎంసీ మెహిదీపట్నం సర్కిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు కోర్టు తీర్పును ఉల్లంఘించి నిర్లక్ష్యంతో రోడ్డేయగా, అది ఇప్పుడు ఎవరికీ ఉపయోగపడకుండా తయారైంది. పూర్తయిన రోడ్డుకు జీహెచ్ఎంసీ అధికారులే అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇటీవల ఓల్డ్ మల్లేపల్లి చౌరస్తా వద్ద రోడ్డు పనులు చేయడానికి రూ.13 లక్షలతో జీహెచ్ఎంసీ అధికారులు టెండర్లు పిలిచారు. 

రోడ్డు వేసే స్థలంపై వివాదం ఉండడంతో కొందరు కోర్టుకు వెళ్లారు. రెండు నెలల కింద అక్టోబర్​19 వరకు  రోడ్డు వేయొద్దని కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇక్కడి ఇంజినీరింగ్ అధికారులు సరిగ్గా 19వ తేదీకి రెండు రోజుల ముందు 17న రాత్రికి రాత్రే రోడ్డు వేశారు.  ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకుపోవడంతో ఆ స్థలాన్ని ఎవరూ ఉపయోగించకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. దీంతో బల్దియా సిబ్బందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు ఉన్నా కమీషన్లకు కక్కుర్తి పడ్డ అధికారులు రూ.13 లక్షలు వృథా చేశారని స్థానికులు ఫైర్​అవుతున్నారు. ఒకవేళ కోర్టు తీర్పు అధికారులకు అనుకూలంగా రాకపోతే రోడ్డు కోసం పెట్టిన రూ.13 లక్షలు  అధికారుల నుంచే వసూలు చేయాలని డిమాండ్ ​చేస్తున్నారు.

తప్పించుకోవడానికి తంటాలు

కోర్టు ఆదేశాలను పాటించని అధికారులు ఇప్పుడు కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటుండగా అధికారులు ఎవరికి వారు తప్పించుకోవడానికి తంటాలు పడుతున్నారు. ఇంజినీరింగ్ సెక్షన్ ఈఈ లాల్ సింగ్ మాట్లాడుతూ ‘మేము రూ.13 లక్షలతో రోడ్డు వేసింది నిజమే. అయితే మేము రోడ్డు వేశాక కోర్టు ఆర్డర్​గురించి తెలిసింది’ అని చెప్పారు. ఏరియా డీఈగా ఉన్న మరో ఆఫీసర్​అసలు రోడ్డు ఎమర్జెన్సీ కింద వేశామని, మున్సిపల్ ఫండ్స్​తో వేసినట్టు ఏ ఆధారమూ లేదంటున్నారు. ‘ఎమర్జెన్సీ కింద రూ.13 లక్షలతో పనులు చేస్తారా? రోడ్డుకు మున్సిపల్ నిధులు ఖర్చు పెట్టలేదా? టెక్నికల్ సాంక్షన్ సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తే ఆ విషయం తనకు 
తెలియదని దాటవేశాడు.