మానుకోట కాంగ్రెస్​ టికెట్ కోసం పోటాపోటీ

మానుకోట కాంగ్రెస్​ టికెట్ కోసం పోటాపోటీ
  • రాష్ట్రంలోనే అత్యధిక డిమాండ్​ ఉన్న సీటుగా మహబూబాబాద్​
  •     48 మంది దరఖాస్తు
  •     కాంగ్రెస్​ బీ ఫామ్​ దక్కితే చాలనుకుంటున్న నేతలు
  •     అధిష్టానం నిర్ణయంపై అందరిలో ఉత్కంఠ

మహబూబాబాద్​, వెలుగు: రాష్ట్రంలోనే మహబూబాబాద్​ కాంగ్రెస్​ ఎంపీ సీటు కోసం ఫుల్​ కాంపిటేషన్​ ఏర్పడింది. ఈ సీటు కోసం ఏకంగా 48 మంది అప్లయ్​ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్​ బీఫామ్​ దొరికితే చాలు ఎన్నికల్లో గెలుపొందడం ఖాయం అని భావిస్తున్నారు.  పార్లమెంట్​పరిధిలో మహబూబాబాద్, డోర్నకల్​,ములుగు, నర్సంపేట, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ గెలిచింది. కేవలం భద్రాచలంలో అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్​ గెలుపొందినది. మెజార్టీ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్​ గెలుపొందడంతో పార్లమెంట్​ ఎన్నికల్లోను అదే వేవ్​ కొనసాగుతుందని కాంగ్రెస్​ లీడర్లు భావిస్తున్నారు.

ఎవరికి దక్కేనో!

కాంగ్రెస్​ అధిష్టానానికి ప్రదేశ్​ఎన్నికల కమిటీ ( పీఈసీ)  పంపే నాలుగు పేర్లలో ఎవ్వరికి చోటు దక్కనుందో అనేది జిల్లాలో హట్​ టాపిక్​గా ఉంది. మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్​, ఆదివాసీ జాతీయ కాంగ్రెస్​ వైస్​ చైర్మన్​ తేజావత్​ బెల్లయ్య నాయక్​, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి అనుచరురాలు విజయభాయి, రిటైర్డ్​​ ఎక్సైజ్​ ఆఫీసర్​ బానోతు మోహన్​లాల్​, డోర్నకల్​ నియోజకవర్గానికి చెందిన మాలోతు నెహ్రునాయక్​, కిసాన్​ పరివార్​ సంస్థ నిర్వాహకుడు భూపాల్​ నాయక్​, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటి రిజిస్ట్రార్​ భట్టు రమేశ్​ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పార్టీకి విధేయులుగా ఉండటం, పార్లమెంట్​ స్థాయిలో పరిచయాలు, ఆర్ధికవనరులు ఉన్నవారికే ఛాన్స్​ దక్కే అవకాశం ఉంది. 

కాంగ్రెస్​ నేతలను నిరతంరం కలుస్తున్నారు

పార్లమెంట్​ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇటీవల గెలుపొందిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడం కోసం ఎంపీ టిక్కెట్​ ఆశిస్తున్న నాయకులు ప్రయత్నిస్తున్నారు.  అధిష్టానం పరిశీలనలో తమ పేరు రాగానే మద్దతు తెలుపాలని కోరుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్​ పెద్దలు ఆయా డీసీసీల ప్రెసిడెంట్స్​, ఇతర నాయకులను క్రమం తప్పకుండా కలుస్తూ మద్దతు కోరుతున్నారు.  

ALSO READ : మున్నేరు ముంచకుండా గోడలు!..6 నుంచి 11 మీటర్ల ఎత్తులో నిర్మాణం

కాంగ్రెస్​ బీఫామ్​ దక్కుతే చాలనుకుంటున్న నేతలు

ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వారితో పాటుగా ప్రభుత్వ సర్వీస్​లో ఉన్న ఉద్యోగులు సైతం కాంగ్రెస్​ టిక్కెట్​ కోసం దరఖాస్తులు చేసుకోవడం విశేషం. ఈ ప్రాంతంలో ఉంటున్న ఆదివాసులు, గిరిజనుల్లో ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభావం ఎక్కువగా ఉండటం, బీజేపీపై వ్యతిరేకత, బీఆర్​ఎస్​ లో ఓటమి నిరాశ... కాంగ్రెస్​కు కలిసి వచ్చేలా ఉంది. దీనికి తోడు ఫుల్​ జోష్​లో ఉన్న కాంగ్రెస్​నేతలు గెలుపు దీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో టికెట్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.