పార్టీ ఆదేశిస్తే ఖమ్మంలో పోటీ : బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు:  తెలంగాణలో ఇప్పుడే అసలు అట మొదలైందని ఓ లీడర్​అంటున్నారని, కాంగ్రెస్​లో వెన్నుపోటు పొడిచే వాళ్లు చాలామంది ఉంటారని, కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయనకు సలహా ఇస్తున్నానని బీజేపీ జాతీయ నేత, తమిళనాడు  సహ ఇన్​చార్జి​ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోట్ల వల్లే నిఖార్సయిన కాంగ్రెస్ వాదిగా ఉన్న తాను బీజేపీలో చేరానన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనన్నారు. కొంత మంది ఏ రకంగా సంపాదించారో తనకు తెలుసన్నారు.

ఏ ఒక్కరూ ఉద్యమకారులను ఆదుకున్న దాఖలాలు లేవని, వారి కుటుంబాలకు న్యాయం చేయని వారు కూడా ప్రజల గురించి మాట్లాడుతున్నారన్నారు. రాష్ర్టంలో బీజెపీ కార్యకర్తలను బద్నాం చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే  తాను ఖమ్మంలో పోటీ  చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్​ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, కడగంచి రమేశ్​ పాల్గొన్నారు.