బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మంగళవారం ప్రకటించారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ బలంగా ఉన్న సెగ్మెంట్లలో మాత్రమే అభ్యర్థులను నిలబెడుతామని తెలిపారు. దీనిపై త్వరలో పార్టీ సీనియర్ లీడర్లు, కార్యకర్తలతో భేటీ అవుతామన్నారు. అందరి అభిప్రాయాల తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తామని వివరించారు. దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి భవిష్యత్ కార్యాచరణ తయారు చేస్తామని తెలిపారు.
తమ పార్టీ ఐదు, ఆరు, మూడు, రెండు లేదా ఒక సీటు గెలిచినా లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్రంగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. ఈ నెల ప్రారంభంలో బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరిగిందన్నారు. జేడీ(ఎస్)ని కూడా ఆహ్వానించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ సూచించారని తెలిపారు. అయితే, కర్నాటక కాంగ్రెస్‌లోని ఓ వర్గం దీన్ని అడ్డుకుందన్నారు. ‘‘నేను ప్రతిపక్షాల మీటింగ్‌కు అటెండ్ కావడం కొందరు కాంగ్రెస్ లీడర్లకు ఇష్టం లేదు. అందుకే నాకు ఫోన్ రాలేదు. 1983 నుంచి ఇప్పటిదాకా మా పార్టీ ఉంది. భవిష్యత్తులో కూడా ఉంటుంది.
ALSO READ :బయటి బ్రాండ్ల ఎఫెక్ట్.. లిక్కర్ సేల్స్ డౌన్
జేడీ(ఎస్) పనైపోయిందని భావించే వారందరూ భ్రమల్లో బతుకుతున్నారు. జేడీఎస్ ఎన్నటికీ మునిగే నావ కాదు”అని దేవెగౌడ స్పష్టం చేశారు. తమ పార్టీ బీజేపీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతుందని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందని దేవెగౌడ కుమారుడు, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి పోయిన వారమే ప్రకటించారు. ఈక్రమంలో దేవెగౌడ చేసిన కామెంట్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.