స్పెషల్: మట్టి పరిమళాల అత్తర్​!

స్పెషల్:  మట్టి పరిమళాల అత్తర్​!

ఎండలకు మాడిపోతున్న నేల మీద మొదటి చినుకు పడినప్పుడు వచ్చే వాసనను తలచుకుంటేనే భలే హాయిగా అనిపిస్తుంది కదా! ఆ అద్భుతమైన సువాసనను ఇండియాలో పర్​ఫ్యూమ్​ తయారుచేసేవాళ్లు ఒడిసి పట్టి అత్తర్​గా బాటిల్​లో నింపి ఇస్తున్నారు. ఈ అత్తర్​ను ఎక్కడ తయారుచేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? అనే వాటి వెనక ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్​లోని కన్నోజ్​ అనే టౌన్​లో శతాబ్దాలుగా కొన్ని తరాలు మిట్టీ(మట్టి) అత్తర్​ తయారుచేస్తున్నాయి. అందుకు మట్టితో తయారుచేసిన రకరకాల వస్తువులతో పాటు  కుల్హడ్​(మట్టితో తయారుచేసిన కప్పులు) కూడా వాడతారు.  మిట్టీ అత్తర్​ను తయారుచేసే మీనా పర్​ఫ్యూమరీ కంపెనీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు రజత్​ మెహరోత్రా. ఈ అత్తర్​ తయారీ గురించి మాట్లాడుతూ ‘‘అన్నాదమ్ములం ఇద్దరం కలిసి ఈ కంపెనీ నడుపుతున్నాం. మాలాంటి కుటుంబాలు శతాబ్దాలుగా ఎనిగ్మాటిక్​ ఫ్రాగ్రెన్స్​ను సీసాల్లో పట్టి అందిస్తున్నాయి. మిట్టీ అత్తర్​ మీకు మరెక్కడా దొరకదు” అని చెప్తూ అత్తర్​ బాటిల్​ నింపుతున్న రజత్​ కళ్లు బాటిల్​లో పడుతున్న మిట్టీ అత్తర్​ మీదనే ఉన్నాయి. అంత జాగ్రత్త ఎందుకంటే మిట్టీ అత్తర్​ ఒక్క చుక్క కూడా ఎంతో విలువైనది. 0.26 గ్యాలన్ల (దాదాపు 0.98 లీటర్లు) 

మిట్టీ అత్తర్​ ధర1,80,000 రూపాయలు.

అత్తర్​ పుట్టింది ఎప్పుడు?

ఈ మిట్టీ అత్తర్​ ఎలా పుట్టిందో తెలుసా? ఆస్ట్రేలియన్​ నేషనల్​ యూనివర్శిటీలో ప్రత్యేకంగా అత్తర్​ గురించి చదువుతున్న ఆంత్రోపాలజిస్ట్‌, బొటిక్​ పర్​ఫ్యూమ్​ హౌస్​ ఓనర్​ గిటి దత్​ ఆ విషయం గురించి చెప్తూ ‘‘మొదటిసారి అత్తర్లు ఎవరు తయారుచేశారనేది ఇప్పటికైతే ఎవరికీ తెలియదు. అలాగే కన్నోజ్​ మాత్రమే అత్తర్లకు కేంద్రంగా ఎలా మారింది అనే దానిపై కూడా స్పష్టత లేదు. కానీ అత్తర్​ను డిస్టిలేషన్​ చేయడం అనేది 3300 బీసీ నుంచి 1300బీసీ వరకు సింధునాగరికతలో ఉంది. అదే పద్ధతిని ఇప్పటికీ కన్నోజ్​లో వాడుతున్నారు. ఎన్నో నాగరికతలు వచ్చిపోయినా, రాజులు రాజ్యాలు పోయినా ఈ పద్ధతి మాత్రం అలానే ఉండటం ఆశ్చర్యకరమైన విషయం.

బ్రిటిష్​  వాళ్ల వల్ల19వ శతాబ్దంలో ఇండియాలో చాలా రకాల దేశీయ కళా రూపాలు అంతరించిపోయాయి. అందుకే అత్తర్​ గురించిన సమాచారం అంతగా దొరకడం లేదు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం. బ్రిటిషర్లు ఇండియాకు రాకముందు కన్నోజ్​ పర్​ఫ్యూమరీకి సంబంధించిన సమాచారం ఏదీ అందుబాటులో లేదు. కాకపోతే కన్నోజ్​లో మెహరోత్రా ఫ్యామిలీ చేస్తున్న అత్తర్​ బిజినెస్​ని చూస్తే మాత్రం చాలా విషయాలు తెలుస్తాయి. అత్తర్​ను బ్రిటిష్ వాళ్లు వర్తకపు సరుకుగా చేయాలనుకుని కన్నోజ్​లో​ పర్​ఫ్యూమ్​ ఇండ్లను సెట్​ చేసినట్టు తెలుస్తోంది? మసకబారిన మూలాలు, చరిత్ర గురించి కాసేపు పక్కన పెడితే... మిట్టీ అత్తర్​ గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలియడం సంతోషించే విషయం” అని చెప్పింది.

అత్తర్​ మీద పేపర్​ ప్రజెంటేషన్​ చేసిన హిస్టోరియన్​ జ్యోతి మార్వా ఈ విషయం మీద మాట్లాడుతూ ‘‘పూర్వకాలంలో సింధు​ ప్రజలు సుగంధభరితమైన నీళ్లు, మొక్కల నుంచి తీసిన కషాయాలు​ వాడి రకరకాల సెంట్స్​ తయారుచేశారు. వాటిని మెడిసిన్స్​లో, దైవసంబంధిత కార్యక్రమాల్లో వాడేవాళ్లు. ఆ తరువాత వేద నాగరికత​లో కూడా ఇలానే జరిగింది’’ అని అప్పటి విషయాలను గుర్తుచేసింది.

మట్టి వాసన కోసం...

మిట్టీ అత్తర్​ను ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలంటే రజత్​ మెహరోత్రా ఫ్యాక్టరీ చూడాల్సిందే. అక్కడ అడుగపెట్టిన వాళ్లకు మొదట కనిపించేది ఇటుక బట్టీలో కాలిన మట్టి డిస్క్​ల కుప్ప. వాటిని ఊళ్లో కుండలు అమ్మే వ్యక్తి దగ్గర తెస్తారు. వాటితో పాటు మట్టితో తయారుచేసిన వేరు వేరు మెటీరియల్స్​ కూడా ఉన్నాయక్కడ. వాటిలో కుల్హడ్స్​ కూడా ఉన్నాయి. కుల్హడ్స్​ అంటే మట్టితో చేసిన టీ కప్పులు. ఆ మెటీరియల్​ అంతా కలిపి దాదాపు 600 పౌండ్లు అంటే దాదాపు 272 కేజీలు ఉంటుంది. 

ఒక పెద్ద రాగి పాత్రలో (డేగ్​) వాటిని వేసి, అందులో కొన్ని నీళ్లు పోసి మూత పెట్టారు. ఆ తరువాత​ చిన్న మూతితో,  పొడవైన మెడ ఉన్న రాగి​ పాత్ర తీసుకున్నారు. ఆ పాత్రను భప్కా అంటారు. అందులో గంధం నూనె పోశారు. అన్ని రకాల అత్తర్లకు బేస్ ఇదే​. భప్కాకి వంపు తిరిగిన వెదురు పైప్​ ఒకటి ఉంది. అది మట్టి మెటీరియల్​ నింపిన పాత్ర​కు కనెక్ట్​ అయి ఉంటుంది. ఈ ప్రాసెస్​ అంతా అయ్యాక తడి ముల్తాని మట్టితో డిస్టిల్లర్​ను సీల్​చేశారు. దాంతో నేచురల్​గా ఎయిర్​ టైట్​ కంటెయినర్​ అయిపోయిందన్నట్టు.

ఓల్డ్​ ఈజ్​ గోల్డ్​!

అత్తర్​ తయారుచేసేందుకు అవసరమైన వాటిని సమకూర్చుకున్నాక డిస్టిల్లర్​ కింద చెక్క, ఆవు పిడకలు వేసి మంట పెట్టారు. ఆ మంట మరీ పెద్దదవకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఒకవేళ మంట ఎక్కువైతే డిస్టిల్లర్ నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. అదే మంట తగ్గిపోతే ఆరిపోతుంది. అలా జరగకుండా ఆవు పిడకలు వేస్తుంటారు. అలా ఏడు గంటలు ఉంచాక ఆ రాగి పాత్ర కింద మంట తగ్గించారు. వేడెక్కిన డేగ్​లో మట్టి ఉడికాక సుగంధపరిమళాలతో నిండిన ఆవిరి, వెదురు పైప్​ ద్వారా చందనం నూనె నింపిన భప్కాలోకి చేరుతుంది. మట్టి సారాన్ని చందనం నూనె నెమ్మదిగా శోషించుకుంటుంది. ఆ తరువాత చందనం నూనె నుంచి నీళ్లను వేరుచేస్తుంది డిస్టిల్లర్​. ఈ ప్రాసెస్​ కనీసం పది రోజులు రిపీటెడ్​గా జరుగుతుంది. 

ఒక్కమాటలో చెప్పాలంటే చిక్కగా ఉండే నూనె మాన్​సూన్​ షవర్స్​ ఫ్రాగ్రెన్స్​ను మోసుకొచ్చేవరకు అన్నమాట. ఒక్క రోజులో సువాసన తెలియదు. అందుకు నాలుగు నుంచి ఐదు రోజులు టైం పడుతుంది. పర్​ఫ్యూమ్​ తయారీ పూర్తయ్యాక ఒంటె చర్మంతో చేసిన ఫ్లాస్క్​లో దాన్ని ఉంచుతారు. ఇలాచేయడంవల్ల పర్​ఫ్యూమ్​లో అదనంగా నీళ్లు ఉంటే ఆవిరైపోయి ఫ్రాగ్రెన్స్​ ఒక్కటే మిగిలిపోతుంది. అత్తర్​ ఎంత పాతది అయితే అంత బాగుంటుంది. ధర కూడా పలుకుతుంది.

పర్​ఫ్యూమ్​ రాజధాని నుంచి..

‘‘మిట్టీ అత్తర్​ కొనేందుకు పర్​ఫ్యూమ్​ క్యాపిటల్​ అయిన గ్రాస్​ నుంచి కూడా ఇక్కడకు వస్తున్నారు. అలాగే న్యూఢిల్లీ, ముంబయి నుంచి కూడా. ‘‘ఫ్రాన్స్​లోని గ్రాస్​ నుంచి మా దగ్గరకు వచ్చి మిట్టీ అత్తర్​ ఎలా తయారుచేస్తున్నామో చూస్తారు. వాళ్లు కూడా మిట్టీ అత్తర్​ తయారీ ట్రై చేశారు. కానీ సరైన ఎసెన్స్​ రాలేదు. చాలామంది కొత్త రకం కోసమని అత్తర్​ తయారీలో సింథటిక్​ మెటీరియల్స్​ కలుపుతారు. అయితే ఎవరు, ఏ రకం పర్​ఫ్యూమ్​ తయారుచేసినా వాటికి బేస్​ మాత్రం అత్తర్​​. అందుకని నేచురల్ పర్​ఫ్యూమ్​ ఆయిల్​ కావాలనుకున్న వాళ్లు మా దగ్గరకు రండి. ఇంతకుముందు న్యూఢిల్లీలో ఉండే డిస్టిల్లర్లు పాన్​లో వాడేందుకు సొంతంగా అత్తర్​ తయారుచేసుకున్నారు. 

కొన్నేండ్లకు పాన్​ పాపులారిటీ తగ్గిపోయింది. దాంతో చాలామంది డిస్టిల్లర్లు ఆ బిజినెస్​ మానేసి కొత్త బిజినెస్​లోకి మారారు. ఇండస్ట్రీలో ఎటువంటి మార్పులు వచ్చినా అత్తర్​ ప్రాభవం మాత్రం తగ్గలేదు. తగ్గదు కూడా. ఈ ఇండస్ట్రీ ఎవర్​గ్రీన్. దీనికి చావు లేదు. కాకపోతే కాలానికి తగ్గట్టు మార్పులు వస్తుంటాయి. అందుకే కొత్తగా పర్​ఫ్యూమ్​ హౌస్​లు రావడం ఆగలేదు. అంతేకాదు ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా నేచురల్​ ఆయిల్స్​ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడనే కాదు ఇంతకుముందు కూడా అత్తర్​కు డిమాండ్​ ఉంది. రసాయనాలతో నిండిన పర్​ఫ్యూమ్స్​ శరీరానికి మంచిది కాదు. అత్తర్​ నేచురల్ ప్రొడక్ట్​. దీన్ని తినొచ్చు కూడా’’  అంటున్నాడు రజత్​ మెహరోత్రా.

అత్తర్​ – ఇత్తర్​

అత్తర్​ను ఇత్తర్​ అని కూడా పిలుస్తారు. సెంటెడ్ ఆయిల్స్​ను సహజసిద్ధమైన పదార్ధాలతో తయారుచేస్తారు. అత్తర్​లలో చాలా రకాలు ఉంటాయి. డమాస్క్​ గులాబీ, మల్లె​ పువ్వుల నుంచి చేసిన అత్తర్లు గాఢంగా ఉంటాయి. మైల్డ్​ స్మెల్​ కోసం అయితే అగర్ ​ఉడ్​ నుంచి తయారుచేస్తారు. మిట్టీ అంటే ‘భూమి’. వానలో తడిచిన నేల అందించే పరిమళాలను శతాబ్దాల నాటి పద్ధతి వాడి కన్నోజ్​లో మాత్రమే తయారుచేస్తున్నారు.