
ఇంటర్ ఫలితాలు వచ్చి పదిరోజులు దాటినా వివాదం కొనసాగుతోంది. మొదట్లో విద్యార్థులు, తల్లిదండ్రులకే పరిమితమైన నిరసనలు తర్వాత విద్యార్థి, ప్రజాసంఘాలు, పార్టీలు తోడవడంతో తీవ్రస్థాయికి చేరాయి. అధికారుల నుంచి నాయకుల వరకు వ్యవహరించిన తీరు,తప్పులు లేవని ఓవైపు చెబుతూనే మరోవైపు సరిచేస్తామనడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు పెంచాయి. సీఎం కేసీఆర్ రివ్యూ చేసి తర్వాతకూడా తప్పులు జరిగినట్టు అధికారులు ఒప్పుకోలేదు. ఇవి ఎప్పుడూ జరిగే తప్పులే అన్నట్టు వ్యవహరించారు. చివరికి ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా వేలాది తప్పులు జరిగినట్టుగా రిపోర్టు ఇచ్చింది. మొదట్లో కొన్ని తప్పులే అని చెప్పిన అధికారులు రిపోర్టు వచ్చిన తర్వాత వాటిని సరిచేశామంటూ సమర్థించుకున్నారు. ఈ తీరుతో స్టూడెంట్స్ ,పేరెంట్స్‌లో ప్రభుత్వం ఏమాత్రం నమ్మకం కల్పించలేకపోయింది. దీనికితోడు ఆత్మహత్యలు కూడా కొనసాగుతుండడంతో నిరసనలు ఆగడం లేదు.
వచ్చింది తక్కువ తప్పులా?…
రిజల్ట్ విడుదలైన రోజు రాత్రి కొందరు స్టూడెంట్ల మెమోల్లో తప్పులొచ్చినట్టు బయటపడింది.మరుసటి రోజు బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్..మూడు తప్పులే జరిగాయని, వాటిని సరిచేశామని చెప్పా రు. తర్వాత కూడా పదేపదే అదే మాట చెబుతూ వచ్చారు. కానీ వరుసగా వందలాది తప్పులు వెలుగులోకి వచ్చాయి . మంచిర్యాల, మహబూబ్ నగర్ జిల్లాలో ఫస్టియర్ టాపర్లుగా నిలిచినవారు కూడా సెకండియర్‌లో తప్పినట్టు చూప్పారు. గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. తప్పులు నిజమేనని కమిటీ స్పష్టం చేసింది. మొత్తంగా వేలాది మెమోల్లో తప్పులు దొర్లినట్టు తెలుస్తోంది.
కోర్టు ఆదేశాల తర్వాతే కదలిక….
ఇంటర్ లొల్లి కోర్టుకెక్కింది. కేసులో పేరెంట్స్ ఇంప్లీడ్ అయ్యారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ తప్పిన 3.2 లక్షల మంది విద్యార్థుల పేపర్లు మళ్లీ దిద్దేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలంటూ ఆదేశించింది. దీంతో కదిలిన ప్రభుత్వం ఫెయిలైన స్టూడెంట్లకు ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని బోర్డు అధికారులకు సూచించింది. కోర్టు చెప్పాకగానీ ప్రభుత్వం నిర్ణయం రాలేదు.
చర్యలకు జంకెందుకు?….
మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్య అనే విద్యార్థికి తక్కువ మార్కులు వేసిన ఘటనలో ఇద్దరిపై బోర్డుఅధికారులు చర్యలు తీసుకొని మమ అన్పించారు. అదే వేలాది మందికి సంబంధించిన తప్పులపై ఒక్క అధికారిపైగానీ, గ్లోబరీనాపైగానీ చర్యలు తీసుకోలేదు. నిబంధనలకు విరుద్ధం గా గ్లోబరీనాతో ఒప్పందం కుదుర్చు కున్నారని త్రిసభ్య కమిటీ కూడా రిపోర్టు ఇచ్చింది. కాకినాడ జేఎన్‌టీయూ వ్యవహా రంలోనూ గ్లోబరీనాపై కేసు నమోదైనట్టు స్పష్టంగా వెలుగులోకి వచ్చింది. అయినా దీనిపై చర్యల్లేవు. మరోపక్క సమాచార హక్కు చట్టం ద్వారా జవాబు పత్రాలను తీసుకోవడం సాధ్యం కాదంటూ ఇంటర్ బోర్డు అధికారులు పాత జీవోను చూపి అందరినీ తప్పుదోవ పట్టించారు. ఇంటర్ బోర్డు కూడా ఆర్టీఐ కిందకే వస్తుందని అధికారులే చెబుతున్నారు. ఆందోళనలు ఎందుకు తగ్గలె? పది రోజులవుతున్నా ఇంటర్ ఆందోళనలు చల్లారడం లేదు. తప్పులు జరిగాయని ప్రభుత్వం ఒప్పుకోక పోవడం, అనుమానాలను నివృత్తి చేయకపోవడం తో ఇవి కొనసాగుతూనే ఉన్నాయి . ఫలితాలు వచ్చిన ఆరు రోజుల తర్వాత సీఎం సమీక్ష జరిగింది. ఆ తర్వాత మూడ్రోజులకు త్రిసభ్య కమిటీ రిపోర్టు వచ్చింది. అయినా బాధ్యులపై చర్యల్లేవు. దీంతో పేరెం ట్స్ , స్టూ డెంట్స్ లో ఇంకా అనుమానాలు తొలగలేదు. మరోవైపు విద్యార్థుల సూసైడ్ లు ఆగలేదు. వీటిని నివారిం చడానికి సరైన చర్యలు తీసుకోలేదని విపక్షాలు, పేరెంట్స్ , స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌తో లాభం లేదని, రీ వ్యాల్యూవేషన్ చేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
ప్రక్షాళన ఎప్పుడు?…
ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలనే వాదన విద్యావేత్తల నుంచి బలంగా వినిపిస్తోంది. భవిష్యత్‌లోనూ టెక్నికల్ సమస్యలకు, అనుమానాలకు తావులేకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఫలితాలను త్వరగా ఇవ్వాలన్న అత్యుత్సాహం కంటే, తప్పులు లేకుండా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు.పేపర్లు దిద్దడంలో లెక్చరర్లపై ఒత్తిళ్లు, తక్కువ టైంలో ఎక్కువ పేపర్లు దిద్దించడం లాంటివి చేయొద్దని చెబుతున్నారు. స్టూడెంట్స్ సూసైడ్స్‌ను తగ్గించేందుకు, ఆ ఆలోచనలు వారిలో రాకుండా ఆత్మస్థైర్యం పెం చేలా విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలని సూచిస్తున్నారు.