- పాలినేషన్ చేస్తున్నా నిలబడని కాత
- జర్మినేషన్, దిగుబడిపై పై ప్రభావం
- ఆందోళనలో రైతులు
గద్వాల, వెలుగు: జిల్లాలో వరుసపెట్టి కురుస్తున్న వానలకు సీడ్ పత్తి పంటపై ఎఫెక్ట్ పడుతోంది. పంటకు రైతులు రోజూ పాలినేషన్ చేస్తున్నా వానల కారణంగా కాయలు నిలబడటం లేదని వాపోతున్నారు.
ఎకరాకు లక్షకు పైగా ఖర్చు...
జోగులాంబ గద్వాల జిల్లా సీడ్ పత్తి పంటకు పెట్టింది పేరు. దాదాపు 40 వేల ఎకరాలలో పంటను సాగు చేశారు. ఎకరాకు లక్షకు పైగా ఖర్చు ఉంటుంది. దిగుబడి కోసం మూడు నెలల పాటు పాలినేషన్ చేస్తారు. కానీ ఇటీవల వానలతో చెనులోనే నీరు నిలిచింది. దీంతో తడి ఆరడం లేదు. కాయలు కూడా రాలిపోతున్నాయి. ఈ పరిస్థితులు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల సీడ్ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నా.. వానల వల్ల పాలినేషన్ నిలిపివేయడంతో ఎకరాకు ఒకటి నుంచి రెండు క్వింటాళ్లు తగ్గే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. . చేనులో నీళ్లు నిలబడిపోవడం వల్ల ఎదుగుదల ఆగిపోయి చేను ఎర్రగా మారుతుందని, తెగులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన పడుతున్నారు. జర్మినేషన్ కూడా ప్రభావం పడనుందని రైతులు వాపోతున్నారు.
24 గంటలు చేనులోనే నీరు ..
వరుసగా వానలు పడుతుండడంతో పత్తి పంటతో పాటు ఇతర పంటలకు నష్టం తప్పడం లేదు. పత్తి చేనులో 24 గంటలు కంటే ఎక్కువగా నీరు నిల్వ ఉంటే ఆ పత్తి మొక్కలు వేర్ల భాగంలో చెడిపోయే ప్రమాదం ఉన్నది. దీని వల్ల కాయలు, పిందెలు, ఆకులు రాలిపోయి రైతుకు నష్టం జరుగుతుంది. దీంతో చేనులో నీరు నిలవకుండా రైతులు బయటకు పంపేందుకు శ్రమిస్తున్నారు.
పత్తి రైతులకు ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే
రోజు వానలతో పత్తి రైతులకు ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. పాలినేషన్ చేశాక ఆరు గంటల వరకు వాన రాకుండా ఉంటే ఆ కాయలు ఫెయిల్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పత్తి చేనులో నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రస్తుతం 20 కేజీల యూరియా, 10 కేజీల పొటాషియం మొక్కలకు అందించాలి. దీంతో కొంతమేర పంట దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సల్ఫేట్ 10 గ్రాములు, ఒక లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి.- సక్రియా నాయక్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్