ముసురుతో..జలకళ..కామారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా వాన

ముసురుతో..జలకళ..కామారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా వాన

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా ముసురు పట్టింది.  శుక్రవారం సాయంత్రం నుంచి  ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది.  3 రోజులుగా ముసురు పట్టడంతో  వ్యవసాయ పనులకు అనుకూలంగా మారింది. వర్షం ఎక్కువగా కురిసిన ఏరియాల్లో ఎగువ నుంచి నీటి ప్రవాహంతో వాగులు ఉరకలెత్తుతున్నాయి.  

నిజాంసాగర్​ మండలంలోని నల్లవాగు మత్తడి పారుతోంది. నిజాంసాగర్​ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది.  ప్రస్తుతం 385 క్యూసెక్కుల వరద వస్తుంది.  ప్రాజెక్టు నీటి మట్టం 17.8 టీఎంసీలు కాగా 3.130 టీఎంసీలకు చేరింది. 

నస్రుల్లాబాద్​లో అత్యధికం..బీబీపేటలో అత్యల్పం

జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పలు ఏరియాల్లో వర్షం కురిసింది.  24 గంటల్లో  అత్యధికంగా నస్రుల్లాబాద్​లో 64 మి.మీ. వర్షపాతం నమోదు కాగా  అత్యల్పంగా బీబీపేటలో 18 మి.మీ. వర్షపాతం నమోదైంది.  బాన్సువాడలో 60. 6 మి.మీ., బీర్కుర్​లో 55.8 మి.మీ., ఎల్లారెడ్డిలో 53 మి.మీ.

బిచ్​కుందలో 48..5 మి.మీ, జుక్కల్​లో 48.1 మి.మీ.,  పెద్దకొడప్​గల్​లో 47.8 మి.మీ.,గాంధారిలో 46.9 మి.మీ.,  డొంగ్లిలో 45.8 మి.మీ., పిట్లంలో 44.6 మి.మీ., నిజాంసాగర్​లో 43.2 మి.మీ., మద్నూర్​లో 42.5 మి.మీ., నాగిరెడ్డిపేటలో 36.2 మి.మీ., కామారెడ్డిలో 29.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. 

మంజీరా నదికి జలకళ

బోధన్​, వెలుగు : మహారాష్ట్ర -తెలంగాణ సరిహద్దులోని మంజీర నది వరద నీటితో కళకళలాడుతోంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో చెరువులు, వాగులు నిండుగా పారుతున్నాయి.  దీంతో గ్రామీణ ప్రజలు చెరువుల తూముల వద్ద చేపలు పడుతున్నారు.  రెండు నెలల తర్వాత మంజీర నది, చెరువులు, వాగులు పారుతుండడంతో గ్రామీణ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

మంజీరలోకి వర్షపు నీరు వస్తుండడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు నదిని చూడడానికి తరలివస్తున్నారు. మంజీరలో వరద నీరు పెరుగుతుండటంతో  పశువులు, గేదెలు, తీసుకువెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.