తిరుమలలో కొనసాగుతున్న భ‌క్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భ‌క్తుల రద్దీ

తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుసగా సెలవులు ఉండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. నడక మార్గాల్లో భక్తుల రద్దీ పెరిగింది. శిలాతోరణ వరకు క్యూలైన్లల్లో భక్తులు నిలుచున్నారు. ఆదివారం ( నవంబర్ 3) శ్రీవారి ఉచిత దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది.  టైమ్ స్లాట్ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 

శ్రీవారి ఆలయ పరిసరాలు, అన్నప్రసాద కేంద్రం, లేపాక్షి సర్కిల్, సీఆర్వో తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది. ఇక వీకెండ్ కావడంతో అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తుల సంఖ్య పెరిగింది. 

భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక  శిలాతోరణం వరకు బయట క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్ లలో వేచి వున్నారు. 

Also Read : సంక్రాంతి నాటికి రోడ్లపై ఒక్క గుంత ఉండొద్దు

మరోవైపు శనివారం తిరుమల శ్రీవారిని 80 వేల 76 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.52 కోట్ల వచ్చింది. 36వేల 829 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.