కంటోన్మెంట్​లోని డిఫెన్స్​ భూములకు ప్రహరీలు

  • రూ.27 కోట్లతో టెండర్లు పిలిచిన హెచ్ఎండీఏ

హైదరాబాద్​సిటీ, వెలుగు:కంటోన్మెంట్ పరిధిలో ఎలివేటెడ్​కారిడార్​నిర్మాణం కోసం భూములు సేకరించిన తర్వాత మిగిలిన జాగాలు కబ్జా కాకుండా ప్రహరీలు నిర్మించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఎలివేటెడ్​కారిడార్ కోసం కంటోన్మెంట్​లో 113.48 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఎంత భూమిని సేకరిస్తే అంతే మొత్తంలో భూములను ఇతర ప్రాంతాల్లో ఇవ్వడానికి హెచ్ఎండీఏ ఇప్పటికే అంగీకరించింది. 

సికింద్రాబాద్- ప్యారడైజ్​నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్ రోడ్ వరకూ 5.32 కిలోమీటర్ల డబుల్​డెక్కర్​ఎలివేటెడ్​కారిడార్, జేబీఎస్​నుంచి శామీర్​పేట ఓఆర్ఆర్​ను కలుపుతూ(18.1 కిలోమీటర్ల) మరో ఎలివేటెడ్​కారిడార్​నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో 197.2 ఎకరాల భూమి సేకరించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇందులో కంటోన్మెంట్​పరిధిలో 113.48 ఎకరాలు, ప్రైవేట్​వ్యక్తుల నుంచి 83.72 ఎకరాలు సేకరించనుంది. తాజాగా సేకరించిన డిఫెన్స్​భూములు మినహా, మిగిలిన భూములకు ప్రహరీ నిర్మించేందుకు ఓకే చెప్పింది. దాదాపు రూ.27 కోట్లతో ప్రహరీలు నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించింది.

డిఫెన్స్​భూములకు ఫెన్సింగ్​ఇలా..

ఫెన్సింగ్​పనుల కోసం టెండర్లు ఆహ్వానించిన అధికారులు ఆరు నెలల్లో పనులు పూర్తిచేయాలని ఆయా కంపెనీలకు షరతులు విధించనున్నారు. జేబీఎస్​నుంచి శామీర్​పేట ఓఆర్ఆర్​వరకు నిర్మించే కారిడార్​వెస్ట్ మారేడ్​పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, ఆల్వాల్, హకీంపేట, తూంకుంట మీదుగా ఓఆర్ఆర్​వరకూ వెళ్తుంది. ఇక ప్యారడైజ్​నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్​రోడ్​వరకు(నేషనల్​హైవే44) 5.32 కిలోమీటర్ల మేర నిర్మించే కారిడార్​సికింద్రాబాద్, తాడ్​బండ్, బోయిన్​పల్లి నుంచి డెయిరీఫామ్​వరకూ వెళ్తుంది. 

ఈ ప్రాంతాల్లో ఆర్మీ భూములకు హెచ్ఎండీఏ అధికారులు ఫెన్సింగ్, ప్రహరీలను నిర్మించనున్నారు. ఈ ఫెన్సింగ్​నిర్మాణాలను నాలుగు రీచ్​లుగా విభజించి పనులు చేపడుతున్నారు. రీచ్​–1ను 6.48 కోట్లు, రీచ్​–2 6.19 కోట్లు, రీచ్​–3 6.99 కోట్లు, రీచ్–4ను 6.98కోట్లతో చేప్టనున్నారు. భూముల సేకరణ ఒప్పందంలో భాగంగానే ప్రహరీలను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ట్రాఫిక్​కు చెక్ 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్​ కారిడార్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్​ సమస్య పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు వస్తే ఆయా ప్రాంతాల్లోని జంక్షన్ల వద్ద సిగ్నల్స్​తొలగించవచ్చు. ఎన్​హెచ్–44 రోడ్​లో మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్​రూట్లలో వెళ్లే వాహనాలకు ట్రాఫిక్​ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే జేబీఎస్–శామీర్​పేట వరకూ నిర్మించే కారిడార్​లో తిరుమలగిరి, ఆల్వాల్​జంక్షన్ల వద్ద ర్యాంపులను 
నిర్మించనున్నారు.