- ప్రజాభవన్‌లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన
పంజాగుట్ట, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రజాభవన్‌లో బైఠాయించారు. ఎన్నోసార్లు వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కదిలేదిలేదని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రజాభవన్‌కు వచ్చిన వీరు.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు.
రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా 1445 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నామని వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, జైపూర్ కాంట్రాక్టు సేవలను క్రమబద్ధీకరించినట్టు గుర్తుచేశారు. దాంతో చిన్నారెడ్డి కొంతమంది అధికారుల బృందంతో సచివాలయానికి వెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించడంతో రాత్రి 10 గంటల తర్వాత కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రజాభవన్నుంచి బయటకు వచ్చారు.