ఆరు నెలల జీతాలు పెండింగ్​ .. డీఎంఈ, వైద్య విధాన పరిషత్​ మధ్య సమన్వయ లోపం

ఆరు నెలల జీతాలు పెండింగ్​ .. డీఎంఈ, వైద్య విధాన పరిషత్​ మధ్య సమన్వయ లోపం
  • ఇబ్బందు ఎదుర్కొంటున్న వైద్య సిబ్బంది
  • వేతనాలు చెల్లించాలని వేడుకోలు

మెదక్, మెదక్ టౌన్, వెలుగు: జిల్లా ప్రభుత్వ దవాఖానలోని ఐసీయూ, బ్లడ్ బ్యాంక్ లో పని చేస్తున్న కాంట్రాక్ట్ డాక్టర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి గత ఆరు నెలలుగా జీతాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్ గా  విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇటు తెలంగాణ వైద్య విధాన పరిషత్, అటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పెండింగ్ వేతనాల చెల్లింపు బాధ్యత మాది కాదంటే మాది కాదంటూ జాప్యం చేస్తున్నాయి. దీంతో ఆ రెండు శాఖల మధ్య వైద్య ఉద్యోగులు నలిగి పోతున్నారు.  ప్రభుత్వం స్పందించి వేతనాలను చెల్లించాలని వేడుకుంటున్నారు.

జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ), బ్లడ్ బ్యాంక్లో డాక్టర్లు, సిబ్బంది 32 మంది కాంట్రాక్ట్,  ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. వారిలో ఐదుగురు డాక్టర్లు కాంట్రాక్ట్ పద్దతి,  ఆరుగురు స్టాఫ్ నర్స్ లు , ల్యాబ్ టెక్నిషియన్ ఒకరు, ఎక్స్ రే టెక్నిషియన్ ఒకరు, వెంటిలేటర్ టెక్నిషియన్ ఒకరు, ఎంఎన్​వోలు ఆరుగురు, ఐఎన్​వోలు ఇద్దరు, సెక్యూరిటీ ముగ్గురు ఉన్నారు.   బ్లడ్ బ్యాంక్​లో స్టాఫ్ నర్స్ లు  ఇద్దరు, ల్యాబ్ టెక్నిషియన్ లు ఇద్దరు, డీఈవో, ల్యాబ్ అటెండర్, డ్రైవర్ ఔట్ సోర్సింగ్  పద్ధతిలో పని చేస్తున్నారు.  వారిలో డాక్టర్లకు రూ.50 వేల వేతనం ఉండగా, సిబ్బందిలో  కొందరికి నెలకు రూ.15 వేలు, మరి కొందరికి రూ.20 వేలు జీతం ఉన్నది.  ప్రభుత్వ జిల్లా దవాఖాన వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండడంతో ఆ శాఖ ద్వారానే రెండు నెలలకు ఒకసారి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బడ్జెట్ విడుదలయ్యేది. 

మెడికల్ కాలేజీ ప్రారంభంతో.. 

గత అక్టోబర్ నెలాఖరులో  మెదక్ పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. అప్పటి నుంచి జిల్లా ప్రభుత్వ దవాఖాన అటు వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), ఇటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో పని చేస్తున్నది. తాజాగా  ఇప్పటి వరకు టీవీవీపీ పరిధిలో ఉన్న జిల్లా ప్రభుత్వ దవాఖానను టీచింగ్ ఆసుపత్రిగా మారుస్తూ డీఎంఈ పరిధిలోకి తీసుకొచ్చింది.  కాగా, ఆసుపత్రిలో పని చేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ డాక్టర్, సిబ్బందికి మెడికల్ కాలేజీ ప్రారంభం కాక ముందు రెండు నెలల వేతనాలు బకాయి ఉండగా, మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యాక నాలుగు నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయి. 

తమ వేతన బకాయిల విషయమై కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు టీవీవీపీ అధికారులను అడిగితే ఆసుపత్రి డీఏంఈ పరిధిలోకి మారినందున వేతనాలు ఆ శాఖనే చెల్లిస్తుందని చెబుతున్నారని, డీఎంఈ అధికారులను అడిగితే ఆసుపత్రి తమ శాఖ పరిధిలోకి మారినట్టు తమకు ఇంకా అధికారిక ఉత్తర్వులు అందలేదని పేర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యను వైద్య విధాన పరిషత్ కమిషనర్, కలెక్టర్,  స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదని వాపోతున్నారు. ఈ విషయమై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శివదయాల్​ను వివరణ కోరగా ఈ సమస్య గత ఆరు నెలల నుంచే ఉన్నదని,  వైద్యారోగ్య కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. 

చాలా ఇబ్బంది అవుతున్నది..

నెల నెలా జీతాలు రాక చాలా ఇబ్బంది అవుతున్నది.  పాత బకాయిలు అన్నీ వెంటనే చెల్లించడంతోపాటు, ఇక నుంచి ఏ నెలకు ఆ నెల జీతాలు చెల్లిస్తే బాగుంటుంది.

 పద్మ, స్టాఫ్ నర్స్, ఐసీయూ 

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నం..

మాకు ఉన్నదే కొద్ది పాటి జీతం.  ఇంటి అద్దె, సామగ్రి కొనుగోలుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నం. ప్రభుత్వం స్పందించి వేతనాలను చెల్లించాలి. 

శివకుమార్, ల్యాబ్ టెక్నిషియన్, ఐసీయూ

అప్పు చేయాల్సి వస్తున్నది..

 జీతాలు రాక ఆరు నెలలు అవుతున్నది.  ఇంటి అవసరాలకు అప్పు చేయాల్సి వస్తున్నది. మేము చాలా ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. 

బషీర్, బ్లడ్ బ్యాంక్ అటెండర్