రుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కోటి రూపాయల ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలోని యువకుల నుంచి ఉద్యోగాల పేరుతో కోటి రూపాయలకు పైగా వసూలు చేసి మోసం చేశాడని బాధితులు పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన మంగ్యాజి అనే వ్యక్తి కామేపల్లి మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సింగరేణి కాలరీస్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి నిరుద్యోగులను బురిడీ కొట్టించాడు. నిరుద్యోగులను ఆదాయ వనరుగా మలుచుకున్నాడు. చివరికి తన బంధువులను కూడా వదలలేదు. కేవలం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోనే 41 లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితులు ఆరోపించారు.
ALSO READ | ఫొటోగ్రాఫర్ చంద్ కు జాతీయ స్థాయిలో ప్రైజ్
ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం గోవింద్రాల, కారేపల్లి మండలంలోని భాగ్యనగర్ తండా, చీమలపాడు, విశ్వనాధపల్లి.. మహబూబాబాద్ జిల్లా బంగ్లా, గూడూరు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ గ్రామాలలో నిరుద్యోగ యువకులకు ఎరవేసాడు. ఒక్కొక్కరి దగ్గర మూడు నుంచి ఐదు లక్షల వరకు ఉద్యోగాల పేరుతో వసూలు చేశాడని, మొత్తం కోటి 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏడాదిన్నర గడిచినా తమకు ఉద్యోగాలు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. తమను మోసం చేసిన మంగ్యాజి పై చట్టపరమైన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.