కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ర్టంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల​ను అధికారంలోకి రాగానే   అమలు చేస్తామని కాంగ్రెస్​ పార్టీ స్టార్​ క్యాంపెయినర్, నల్గొండ కాంగ్రెస్​ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చెప్పారు. ఆదివారం నల్గొండ పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్  పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్​లపై  ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల జనుల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టంలో ఉద్యోగులకు సకాలంలో వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీఖునే వేతనాలు అందజేస్తామన్నారు. దేశంలోనే  ఎక్కడాలేని విధంగా ఉద్యోగులకు 5 శాతం ఐఆర్​ ఇచ్చి అవహేళన చేసిన  ఘనత బీఆర్ఎస్​ దని, ఉద్యోగులకు సంబంధించి 3 డీఏలు పెండింగ్​లో ఉన్నాయన్నారు. గ్రూప్స్​, డీఎస్సీ నిర్వహించడంలో కేసీఆర్  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఫైర్  అయ్యారు. రాష్ర్టంలో 70 వేల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని విమర్శించారు. 

రూ.9 లక్షల కోట్ల అప్పుచేసి కాలేశ్వరం కడితే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, నాణ్యత లేకుండా ప్రాజెక్టులు కట్టడం వల్లే అలా జరిగిందన్నారు. దీనిపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేసి సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిని బట్టి బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఒప్పందం కుదిరిందనేదని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు నియామకాల సంబంధించి అన్యాయం జరుగుతుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, దీంతో చలించిన సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, మూడు నెలల్లోనే పేదలందరికీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.