అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వీఆర్ఎలకు, సెర్ప్ ఉద్యోగులకు, మెప్మా, ఐకేపీ సిబ్బందికి, ఫిల్డ్ అసిస్టెంట్లకు వరాలు కురిపించారు. కానీ ఎంతో కాలంగా బాలికల విద్యకు, విద్యా వ్యవస్థకు సేవలందిస్తున్న కేజీబీవీ టీచర్లు, సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఊసే ఎత్తలేదు. కేవలం 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులర్ చేయనున్నట్లు ప్రకటించడంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కేజీబీవీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యూఆర్ఎస్ టీచర్లు, సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వీరిని రెగ్యులరైజ్చేయడంతోపాటు సమాన వేతనాలు అందించాలి.
వనపర్తి సభలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు సర్వత్రా ఆసక్తి కలిగించాయి. అందరూ టీవీలు చూడండి అసెంబ్లీలో 10 గంటలకు అత్యంత ముఖ్యమైన విషయం ప్రకటిస్తానని చెప్పేసరికి నిరుద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ ఎంతో ఆశతో ఎదురు చూశారు. గత ఎన్నికల ముందు కూడా వనపర్తి సభలోనే ముఖ్యమంత్రి మాట్లాడారు. కేజీబీవీలో పని చేస్తున్న ఆడపడుచుల కష్టాన్ని గుర్తించామని, కేజీబీవీల్లో పని చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని మాట కూడా ఇచ్చారు. కానీ వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఒకింత నిరుద్యోగుల ఆశలకు ఊపిరి పోస్తూ.. 80,039 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం నిరాశే మిగిలింది. బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో 50,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తుండగా.. సీఎం కేసీఆర్ కేవలం 11,103 మందిని రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కేజీబీవీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యూఆర్ఎస్ టీచర్లు, సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరాశకు గురయ్యారు.
475 కేజీబీవీల్లో..
భారత ప్రభుత్వం 2004లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)ను ప్రారంభించింది. మన రాష్ట్రంలో 2005–2006లో కేజీబీవీలు మొదలయ్యాయి. గత15 ఏండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా 475 విద్యాలయాలు ఏర్పాటు కాగా, వాటిల్లో సుమారు11వేల బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి వరకే నిధులు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఆయా విద్యాలయాలను 12 తరగతుల వరకు అప్‌గ్రేడ్ చేస్తూ కొనసాగిస్తోంది. కానీ ఆయా తరగతులకు సరిపడా సిబ్బంది, ఉపాధ్యాయులను నియమించకపోవడం వల్ల ఉన్నవారిపై తీవ్ర పని ఒత్తిడి పెరుగుతోంది. కేజీబీవీలు ప్రారంభంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్, రాజీవ్విద్యామిషన్లలో భాగంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం సమగ్ర శిక్షలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వ, లోకల్ బాడీ టీచర్లలాగా డీఈవో పరిధిలో సిబ్బంది, టీచర్లను నియమిస్తున్నారు. వీరంతా డీఈవో పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు.6,7,8 తరగతులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసిన 9,10,11,12 తరగతులను కూడా బోధిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వేతనాలు చెల్లిస్తునప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తక్కువ వేతనాలు పొందుతున్నారు. టీచర్లు ఇతర సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తూ వారికి వేతనాలు అందజేస్తోంది. చాలీ చాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న కేజీబీవీ టీచర్లు, సిబ్బందిని రెగ్యులరైజ్చేయడంతోపాటు వారికి పే స్కేల్ వర్తింపజేయాల్సిన అవసరం ఉంది.
సమగ్ర శిక్ష ఉద్యోగులదీ ఇదే పరిస్థితి..
దేశవ్యాప్తంగా 2001 –- 2002వ సంవత్సరంలో సర్వ శిక్ష అభియాన్ ప్రారంభమవగా 2018లో దాన్ని సమగ్ర శిక్ష అభియాన్ గా మార్చారు. 2004 సంవత్సరం నుంచి అంటే సుమారు17 సంవత్సరాలుగా మండల వనరుల కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. గత15 ఏండ్లుగా 797 మంది ప్రత్యేక ఉపాధ్యాయులు(ఐఈఆర్పీలు)ఇప్పటికీ కాంట్రాక్టు ప్రాతిపదికనే పనిచేస్తున్నారు. తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రవ్యాప్తంగా 2500 మంది సీఆర్పీలు మండల వనరుల కేంద్రం పరిధిలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎమ్ఐఎస్ కోఆర్డినేటర్లు ఎంఆర్సీ పరిధీలో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. మెసెంజర్స్ కూడా 9 ఏండ్లుగా ఎంఆర్సీ పరిధిలోనే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరితోపాటు జిల్లా కేంద్రాల్లో కూడా సమగ్ర శిక్షలో అనేక మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిలోనే పని చేస్తున్నారు. వారంతా తక్కువ వేతనాలకే పనిచేస్తూ.. జీవితాలు కొనసాగిస్తున్నారు. గత పీఆర్సీలో కాంట్రాక్టు ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెరిగినప్పటికీ, ఇప్పుడు పెరిగిన ధరలతో పోలిస్తే అవి చాలా తక్కువే. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 11 వేల కేజీబీవీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యూఆర్ఎస్ టీచర్లు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, టీచర్లు అందరికీ న్యాయం చేయాలి. వారందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఇవ్వాలి.
హామీలు ఉత్తవే..
రాష్ట్రంలో ఉన్న ఇతర ఆశ్రమ స్కూళ్లతో పోలిస్తే కేజీబీవీ టీచర్ల వేతనాలు చాలా తక్కువ. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పోటీ పడి మంచి ఫలితాలు సాధిస్తున్నా.. వారి బేసిక్ పేతో పోలిస్తే సగం జీతం కూడా కేజీబీవీ టీచర్లకు అందడం లేదు. వార్డెన్ లేకపోవడం వల్ల వారంలో ఒక రోజు తప్పనిసరిగా రాత్రి డ్యూటీ చేయాల్సివస్తోంది. చాలా కాలంగా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని కోరుతుండగా ప్రభుత్వం గత పీఆర్సీలో 30 శాతం మాత్రమే జీతాలు పెంచి చేతులు దులుపుకుంది. ఇతర కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఇప్పటివరకు టైమ్ స్కేల్ ఇచ్చారు. ప్రస్తుతం వారి సర్వీస్‌ను కూడా రెగ్యులరైజ్చేస్తున్నారు. కానీ ఎంతో కష్టపడి బాలిక అక్షరాస్యతకు కృషి చేస్తున్నా కేజీబీవీ టీచర్లను మాత్రం ప్రభుత్వం క్రమబద్ధీకరించడం లేదు. టీచర్ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అనేక రకాల హామీలు ఇస్తూ ఓట్లు వేయించుకున్న నాయకులు.. వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
:: జుర్రు నారాయణ యాదవ్, తెలంగాణ టీచర్స్ యూనియన్