బాసర ట్రిపుల్‌‌ ఐటీలో కాంట్రాక్ట్‌‌ లెక్చరర్ల మూకుమ్మడి రాజీనామా

బాసర ట్రిపుల్‌‌ ఐటీలో కాంట్రాక్ట్‌‌ లెక్చరర్ల మూకుమ్మడి రాజీనామా
  • అదనపు బాధ్యతలు అప్పగించడం పట్ల నిరసన

బాసర, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా బాసర ట్రిపుల్‌‌ ఐటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌‌ లెక్చరర్స్‌‌ బుధవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లెటర్స్‌‌ను ఏవో రణధీర్‌‌కు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొన్నేండ్లుగా టీచింగ్‌‌తో పాటు పరిపాలనా బాధ్యతలు సైతం నిర్వహిస్తున్నామని, అయినా తమను రెగ్యులరైజ్‌‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. 

తమ డిమాండ్లు నెరవేర్చకుండా ఇప్పుడు అదనపు బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. దీనిని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రిపుల్‌‌ ఐటీలో మొత్తం 120 మంది కాంట్రాక్ట్‌‌ లెక్చరర్లు ఉండగా.. 50 మంది రాజీనామా లెటర్లు అందజేశారు. ఉపేందర్, కృష్ణప్రసాద్, శంకర్ దేవరాజ్, వినోద్, మందా సతీశ్, డాక్టర్ విజయ్‌‌కుమార్‌‌, శ్రీశైలం పాల్గొన్నారు.