సీఆర్టీలకు జీతాల్లేవ్ .. ఐదు నెలలుగా వేతనాలందక అవస్థలు

సీఆర్టీలకు జీతాల్లేవ్ .. ఐదు నెలలుగా వేతనాలందక అవస్థలు
  • పూట గడవడానికి అప్పులు చేస్తున్న కాంట్రాక్ట్​ టీచర్లు   
  • రెగ్యులరైజ్ చేస్తామని బీఆర్​ఎస్​ సర్కారు మోసం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఐటీడీఏల పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ రెసిడెన్షియల్​ టీచర్​(సీఆర్​టీ)లకు ఐదు నెలలుగా జీతాలు రాలేదు.  పర్మినెంట్​ టీచర్లతో సమానంగా పని చేస్తున్న సీఆర్టీలకు నెలనెలా జీతాలందడం లేదు.    ఐటీడీఏ పరిధిలో గతంలో ఉన్న హాస్టల్స్​ను  ఆశ్రమ పాఠశాలలుగా మార్చారు.

ఈ పాఠశాలల్లో చదువు చెప్పేందుకు టీచర్లను రిక్రూట్​ చేయకపోవడంతో  సీఆర్టీలను నియమించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్​, ఆదిలాబాద్​ జిల్లాల్లో ఐటీడీఏల పరిధిలో  ఉన్న  ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 2వేల మంది కాంట్రాక్ట్​ రెసిడెన్షియల్​ టీచర్లు పనిచేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 265 మంది, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 211 మంది సీఆర్టీలు ఉన్నారు.  అన్ని స్కూళ్లలో సీఆర్టీలతోనే బోధనేతర పనులు కూడా చేయిస్తున్నారు.   రాత్రి స్టడీ అవర్స్ బాధ్యత అంతా  సీఆర్టీలే చూస్తున్నారు. టెన్త్​లో మంచి రిజల్ట్స్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా వారిమీద పెట్టడంతో తీవ్ర ఒత్తిడిలో పని చేయాల్సివస్తోంది.

అప్పులతో నెట్టుకొస్తున్నారు  

ఎంత కష్టపడి పని చేసినా సీఆర్టీలకు సరిగా జీతాలు మాత్రం చెల్లించడంలేదు. ఒక్క రోజు జీతం ఆలస్యమైతేనే  ఇబ్బంది పడాల్సివస్తుంది. అలాంటిది  సీఆర్టీలకు నెల తరబడి  జీతాలు రావడంలేదు.  గత  సెప్టెంబర్​ నుంచి  సీఆర్టీలకు జీతాలు చెల్లించలేదు.  ఐదునెలలుగా సాలరీ రాకపోవడంతో ఎలా బతకాలో అర్థం కావడంలేదని  టీచర్లు వాపోతున్నారు.

దొరికిన చోటల్లా అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.   రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ గవర్నమెంట్​అయినా పెండింగ్​ జీతాలను క్లియర్​ చేయడంతోపాటు..  నెల నెలా జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Also read : పట్టాలిచ్చి.. హద్దులు మరిచారు.. ఎస్సారెస్పీ నిర్వాసిత రైతులకు తిప్పలు

 పర్మినెంట్​ చేయండి

సీఆర్టీలను  పర్మినెంట్​ చేస్తామని గతంలో  బీఆర్​ఎస్​ ప్రభుత్వం హామీ ఇచ్చింది. తమ ఉద్యోగాలు రెగ్యులర్​ అయితే కష్టాలు తీరుతాయన్న ఆలోచనతో  ఎన్ని ఇబ్బందులున్నా పని చేస్తున్నారు.  ఏండ్లు గడిచినా రెగ్యులరైజేషన్​  ప్రక్రియ చేపట్టకుండా  అప్పటి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ ఉద్యోగాలను రెగ్యులర్​ చేసి   తమకు న్యాయం చేయాలని అంటున్నారు.

అవస్థలు పడ్తున్నాం 

నెల నెలా జీతం లేక అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నాం. ప్రభుత్వం, ఐటీడీఏ ఆఫీసర్లు స్పందించి ప్రతి నెలా జీతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.   పర్మినెంట్​ చేస్తామని గత బీఆర్​ఎస్​ మోసం చేసింది. కాంగ్రెస్​ గవర్నమెంట్​ న్యాయం చేస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. 
- జి. రవికుమార్ , జిల్లా  సెక్రటరీ, 
కాంట్రాక్ట్​ టీచర్ల  సంఘం