పండుగలు వస్తున్నయ్.. పోతున్నయ్.. పిల్లలకు కొత్త బట్టల్లేవు.. పండక్కి అప్పాలు చేసుకునే పరిస్థితి అసలే లేదు.. తినడానికి బువ్వ దొరికితే చాలు అన్నట్టుంది ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ టీచర్స్ పరిస్థితి. ఐదు నెలలుగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు ఇవ్వట్లేదు. దీంతో కాంట్రాక్టు టీచర్స్ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో 39 గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 2003 నుంచి రెగ్యులర్ టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిల్లో కాంట్రాక్ట్ పద్దతితో ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 12 మంది, వరంగల్ లో 26, జనగామ జిల్లాలో 27 మంది.. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 82 మంది, ములుగు జిల్లాలో 51, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 46 మంది కాంట్రాక్ట్ టీచర్లు పని చేస్తున్నారు.
రెగ్యులర్ టీచర్లు లేకున్నా.. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించడంతో ఈసారి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మంచి రిజల్ట్స్ వచ్చాయి. దాంతో విద్యాశాఖ అధికారులు కాంట్రాక్ట్ టీచర్లకు అభినందనలు తెలిపారు. ఇంత కష్టపడుతున్న తమకు.. జీతాలు ఎందుకివ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు. పగలనక, రాత్రనక ఒక్కో విద్యార్థిపై శ్రద్ధ తీసుకొని అన్ని సబ్జెక్టులు చెబుతున్నామన్నారు. తమకు వేతనాలు మాత్రం టైమ్ కి ఇవ్వట్లేదని కాంట్రాక్ట్ టీచర్స్ వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వేతనాలివ్వకుండా వెట్టి చాకిరి చేయిస్తోందని కాంట్రాక్ట్ టీచర్స్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పండుగలు జరుగుతున్నందున..ఈ టైమ్ లో అయినా వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు తెచ్చిన తమకు ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ లో ఉన్న శాలరీస్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి యేటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రెన్యువల్ చేస్తున్నారే తప్ప.. సర్వీస్ పొడిగించడం లేదని వాపోతున్నారు. పెండింగ్ వేతనాలు మంజూరు చేయడంతో పాటు అందర్నీ రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తాము విధులు బహిష్కరించి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.