మణుగూరు, వెలుగు: సింగరేణి సంస్థలోని ఓబీ కంపెనీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమకు జీతాలు పెంచాలంటూ మెరుపు సమ్మె చేపట్టారు. కొద్దిరోజులుగా తమకు జీతాలు పెంచాలంటూ పలు దఫాలుగా ఓబీ కంపెనీ యాజమాన్యాలకు వినతి పత్రాలు అందజేసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో విషయాన్ని సింగరేణి అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు.
అయినా ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్స్ పట్టించుకోకపోవడంతో మణుగూరు ఏరియాలోని పలు కంపెనీలకు చెందిన కాంట్రాక్టు కార్మికులు శనివారం మెరుపు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమకు జీతాలు పెంచాలంటూ ఆందోళన చేపట్టడంతో అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు ఓబీ కంపెనీలతో మాట్లాడి రూ.1,750 పెంచేలా అగ్రిమెంట్ చేయించారన్నారు.
ఇప్పుడు తాము రూ.2000 పెంచాలని డిమాండ్ చేయగా, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ లీడర్స్ రూ.1000 మాత్రమే పెంచి అగ్రిమెంట్ చేయాలని ఓబీ కంపెనీలకు సూచించారని తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో పర్మినెంట్ కార్మికుల కన్నా తాము అధికంగా శ్రమిస్తున్నామని, అయినా తమ డిమాండ్లను పరిష్కరించడం లేదన్నారు. సమ్మెకుపలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి.