కొడిమ్యాల, వెలుగు: ఏడాది గడుస్తున్నా అధికారులు రూ.20 లక్షల బిల్లులు చెల్లించడం లేదని జీపీ బిల్డింగ్ కు కాంట్రాక్టర్ తాళం వేశాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్ గ్రామంలో జీపీ బిల్డింగ్ నిర్మించేందుకు ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.20 లక్షలు మంజూరయ్యాయి. మాజీ సర్పంచ్ భర్త గంగారావు బిల్డింగ్ నిర్మించాడు.
గత ఏడాది బిల్డింగ్ నిర్మించి అప్పజెప్పినా, అధికారులు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారుల చుట్టూ తిరిగినా బిల్లులు రాకపోవడంతో మంగళవారం పంచాయతీ ఆఫీస్ కు తాళం వేశాడు. బిల్లులు ఇచ్చేంత వరకు ఆఫీస్ తెరిచే ప్రసక్తే లేదని తెలిపాడు.