తహసీల్దార్​ ఆఫీసుకు కాంట్రాక్టర్ తాళం

తహసీల్దార్​ ఆఫీసుకు కాంట్రాక్టర్ తాళం
  •  గత ప్రభుత్వ టైంలో పనులు చేసినా ఇప్పటికీ బిల్లులివ్వలేదని నిరసన  
  • రూ.50లక్షలు పెట్టి అప్పులపాలయ్యానని ఆవేదన 

ఇబ్రహీంపట్నం, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు నేటికీ బిల్లులు చెల్లించలేదంటూ ఓ కాంట్రాక్టర్ తహసీల్దార్​ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపాడు. తనకు రావాల్సిన బిల్లులు చెల్లించే వరకు తీయబోనని తేల్చి చెప్పాడు. బీఆర్ఎస్​హయాంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్​ఆఫీస్​శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ పక్కనే పాక్షికంగా నిర్మించి వదిలేసిన జడ్పీ అతిథి గృహంలోకి షిఫ్ట్​చేయాలని అధికారులు నిర్ణయించారు. పనులను పోల్కంపల్లి గ్రామానికి చెందిన గండికోట దానయ్య అనే సివిల్​కాంట్రాక్టర్​కు అప్పగించారు. 

ఒప్పందం ప్రకారం రూ.50 లక్షల ఖర్చుతో దానయ్య పనులు పూర్తి చేశాడు. తర్వాత తహసీల్దార్​ఆఫీస్​జడ్పీ అతిథి గృహంలోకి షిఫ్ట్​చేశారు. ప్రస్తుతం అందులోనే కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో సోమవారం తహసీల్దార్​ఆఫీస్​గేటుకు తాళం వేసి కాంట్రాక్టర్​దానయ్య నిరసన తెలిపాడు. బిల్లుల కోసం ఏండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నానని వాపోయాడు. బిల్డింగ్​పనులు పూర్తిచేసి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సముదాయించడంతో నిరసనను విరమించాడు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరాడు.