కరీంనగర్, వెలుగు: కరీంనగర్ స్మార్ట్ సిటీ లో కాంట్రాక్టర్లు, లీడర్లు కలిసి పనులను ఆగమాగం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఎటు చూసినా కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా డ్రైయిన్ల కట్టేందుకు చాలా మంది ఇండ్లు, ప్రహరీ గోడలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. కానీ అదే అధికారంలో ఉన్న వారి దగ్గరకు వచ్చే సరికి మాత్రం మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. పైగా ప్లాన్ మార్చి డ్రెయిన్లను వంకర్లు తిప్పుతున్నారు. కాంట్రాక్టర్లను చేతుల్లోకి తీసుకుని చక్రం తిప్పుతున్నారు.
అధికారం ఉందనే..
రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న పలు ఇండ్లను ఒక్కోచోట ఒక్కోలాగా కూలుస్తున్నారు. 27వ డివిజన్ లోని ఎన్ ఎన్ గార్డెన్ నుంచి నాఖా చౌరస్తాకు వెళ్లే రోడ్ లో ఇరువైపులా పూర్తి స్థాయిలో సీసీ డ్రైయిన్ నిర్మించాల్సి ఉంటుంది. కానీ మూల వద్దకు రాగానే పనులు ఆపేశారు. అక్కడి నుంచి సీసీ డ్రెయిన్ కు బదులుగా పైపులు వేస్తున్నారు. ఈ ఏరియాలో కార్పొరేటర్ కు సంబంధించిన ఇండ్లు ఉండటంతోనే ఇలా సీసీ డ్రెయిన్ నిర్మాణం చేపట్టకుండా వదిలేసి పైపులు వేస్తున్నారు. అధికారులు కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారో అని స్థానికులు అంటున్నారు. ఇలా ఒకరిద్దరి ప్రయోజనాల కోసం ప్లాన్లు మార్చడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని హుసేనిపుర కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షురాలు షబనా మహ్మద్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. - కిసాన్ నగర్ లో ఏరియాలో అధికార పార్టీ నేతల ఇండ్లకు డ్యామేజ్ కలగకుండా డ్రెయిన్ నిర్మిస్తున్నారు. ఆ రోడ్ లో రోడ్డుకు అటు, ఇటు ర్యాంపులు.. గద్దెలు.. ప్రహరీలు కూల్చి వేశారు. కానీ అధికార పార్టీ నేతల ఇండ్ల దగ్గరకు రాగానే డ్రెయిన్ల నిర్మాణాలు ఆపివేశారు. ఇక్కడి నుంచి డ్రెయిన్ పోవద్దని సుమారు 50 మీటర్లు చుట్టూ తిప్పి డ్రెయిన్ కట్టడమంటే అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరొక నేతకు చెందిన వాణిజ్య సముదాయాలు డ్రెయిన్ కు అడ్డం రాగా పక్క నుంచి వేశారు. ఇలా అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం.. సామాన్యులకు ఒక న్యాయమా అని స్థానికులు అంటున్నారు.
నాసిరకంగా పనులు..
నిర్మాణాలు, పనులు జరిగే చోట్ల నాణ్యత పరిశీలించాల్సిన ఆఫీసర్లు కంటికి కనిపించడం లేదు. కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా నిర్మిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. అశోక్ నగర్ లో ఇంటర్ కనెక్షన్ కోసం కొత్తగా వేసిన స్మార్ట్ సిటీ రోడ్ ను అడ్డంగా తవ్వేశారు. పైపు లైన్లు వేసేముందు అడుగు భాగంలో ఇసుక, కంకర డస్ట్ కలిపి బెడ్ నిర్మాణం చేపట్టిన తర్వాతే పైప్ లైన్ వేయాల్సి ఉంటుంది. కానీ ఇవేమి వేయకుండానే పైపులు పరుస్తున్నారు. దీంతో అడుగు భాగంలో ఉండే రాళ్లు.. ఇతరత్రా వ్యర్థాలు లోపలే ఉండటంతో పైపులు పగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాఖా చౌరస్తాలో వేస్తున్న పెద్ద పైపు లైన్ కు సైతం అడుగు భాగంలో ఎలాంటి బెడ్ నిర్మాణం చేపట్టకుండానే వేస్తుండటం గమనార్హం. ఇలా వేస్తూ పోతే అవి భారీ వర్షాలకు కుంగే ప్రమాదం ఉంది. పనులు జరిగే చోట వర్క్ ఇన్ స్పెక్టర్లు, ఏఈలు, కాంట్రాక్టర్లతో కలిసి పోయారనే ఆరోపణలు వస్తున్నాయి. పనుల్లో నాణ్యత పాటిస్తున్నారా లేదా చూడటం లేదు. కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న పనుల్లో క్వాలిటీ లేకపోతే నిర్మించిన కొద్ది రోజులకు దెబ్బతినే అవకాశాలున్నాయి. అయినా అధికారుల్లో చలనం ఉండటం లేదు. కొన్ని చోట్ల ఎటువంటి ప్లానింగ్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్ లో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నా...యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇకనైనా అధికారులు పనుల్లో క్వాలిటీ పాటించాలని పబ్లిక్ కోరుతున్నారు.