హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద పెద్ద పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. బిల్లులు ఎప్పుడు వస్తాయోననే భయంతో వెనక్కి తగ్గుతున్నారు. దీంతో చాలా పనులకు అధికారులు టెండర్లను రీకాల్ చేయాల్సి వస్తోంది. ఎంతో అవసరమైన మూసీ నదిపై పురానాపూల్, మూసారాంబాగ్, అత్తాపూర్ బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఇంట్రెస్ట్ చూపలేదు. ఒక్కో పని రూ.50కోట్లకి పైగా ఉండడంతో పనులు చేసినా.. బిల్లులు వెంటనే రావనే ఆలోచనలో కాంట్రాక్టర్లు ఉన్నారు. మెహిదీపట్నం సర్కిల్లోని సయ్యద్‌నగర్ నుంచి బల్క్ లాన్ పూర్ నాలా మీదుగా కమ్రుద్దీన్ పేటకు బ్రిడ్జిని పొడిగించేందుకు ఇప్పటివరకు తొమ్మిది సార్లు టెండర్లు వేసినా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పటికే కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ నాలుగు నెలల బిల్లులు పెండింగ్ పెట్టింది.
దాదాపు వెయ్యి కోట్లు రావాల్సి ఉందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. వర్షా కాలం సమీపిస్తున్నప్పటికీ పూడికతీత పనులు చేయడంలేదు. రెండు, మూడేళ్లుగా పూడిక తీత పనులు సరిగ్గా జరగడం లేదు. 2021లో రూ.44 కోట్లతో పూడిక పనులు చేసినట్లు అధికారులు చెప్పినప్పటికీ, విజిలెన్స్అధికారుల తనిఖీల్లో సగానికిపైగా నాలాల్లో పూడిక తీయలేదని తేలింది. 15 మంది ఇంజనీర్లకు ఇటీవల షోకాజు నోటీసులు ఇచ్చారు. 38 మంది అధికారుల వేతనాల్లో కమిషనర్ కోతలు విధించారు.
చెప్పేదొకటి.. చేస్తుందొకటి
‘సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. నిధులు లేకపోతే నాకు చెప్పండి. విడుదల చేస్తాను’ అని మంత్రి కేటీఆర్ బల్దియా అధికారులకు ఓ సమావేశంలో చెప్పారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బిల్లులు టైంకు వస్తామని కాంట్రాక్టర్లు ఆశించినప్పటికీ అలా జరగలేదు. ఐదారు నెలలకోసారి అందుతున్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పనులు చేశాక పైసల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఒక్కోసారి పనులు బంద్ చేసి నిరసన తెలిపితే తప్ప బిల్లులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాత్రం గ్రేటర్ పరిధిలో ఎక్కడా ఇబ్బందులు లేవని, రోడ్లు, నాలాల పనులను వెంటనే చేయిస్తున్నామని, బిల్లులు ఆగడం లేదని అంటున్నారు.
కొన్ని పనులకు 14 సార్లు టెండర్లు
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 289 టెండర్లు కొనసాగుతుండగా ఇందులో 77 పనులకు రీకాల్ చేసిన టెండర్లే ఉన్నాయి. కొన్నింటికి 5 నుంచి 10 సార్లు, ఒకటి, రెండు పనులకు ఏకంగా 14 సార్లు టెండర్లు పిలవాల్సి వచ్చింది. మెయిన్ రోడ్లపై అవెన్యూ ప్లాంటేషన్లకు సంబంధించిన పనులు ఎవరూ చేయడం లేదు. నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి కాచిగూడ మెట్రో స్టేషన్ వరకు రెండు వైపులా మెట్రో కారిడార్‌లో అవెన్యూ ప్లాంటేషన్ ఏడాది నిర్వహణకు14 సార్లు టెండర్ రీకాల్ చేశారు. బంజారాహిల్స్ దేవకొండ బస్తీలో డ్రెయిన్ బాక్స్‌ల కోసం మూడు సార్లు టెండర్లు రీకాల్ చేశారు. ఇలా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వర్టికల్ గార్డెన్స్, చెరువులు ఏ పనులనైనా చేసేందుకు కాంట్రాక్టర్లు ముందు రావడం లేదు.
డేంజర్ హోల్స్
మెహిదీపట్నం: సికింద్రాబాద్ కలాసిగూడలోని డ్రైనేజీ గుంతలో పడి చిన్నారి మృతి చెందినా అధికారుల్లో చలనం లేదు. ప్రతిరోజు వాన దంచికొడుతున్నా ఎలాంటి ఇండికేషన్ బోర్డులు పెట్టకుండా మ్యాన్‌హోళ్లను తెరిచి వదిలేస్తున్నారు.
రిపేర్లలో భాగంగా కాకతీయ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ శ్మశానవాటిక వద్ద వాటర్‌బోర్డు సిబ్బంది ఇలా పెద్ద గుంత తవ్వి వదిలేశారు. బారికేడ్లు తెచ్చి గుంత చుట్టూ ఏర్పాటు చేయకపోవడంపై జనం మండిపడుతున్నారు. కాంట్రాక్టర్లు రిస్క్ తీస్కోవట్లే బల్దియా పనుల విషయంలో కాంట్రాక్టర్లు రిస్క్ తీసుకోవడం లేదు. చేసిన పనులకు బిల్లులు టైంకు రావట్లేదు. దీంతోనే టెండర్లు రీ కాల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు బిల్లులు ఇస్తే పనులు చేసేందుకు ముందు ఉంటాం. చాలామంది కాంట్రాక్టర్లు అప్పులు చేసి పనులు చేయిస్తున్నారు. వారంతా బిల్లులు లేట్ అయి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఆలోచించాలి. ఫైనాన్స్ ఏసీ కెనెడీ ఉన్నంత కాలం కాంట్రాక్టర్లకి ఇబ్బందులు తప్పవు. – సురేందర్ సింగ్, జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ