బల్దియా టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకొస్తలె

బల్దియా టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకొస్తలె


హైదరాబాద్​, వెలుగు: గ్రేటర్​పరిధిలో పనులు పూర్తిచేసి నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో కొత్తగా టెండర్లు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.  వానాకాలం ప్రారంభం కావడంతో నాలాల పూడిక తీత, చెరువుల రిపేర్లు లాంటి అత్యవసరమైన పనుల కోసం  బల్దియా అధికారులు ఐదారుసార్లు టెండర్లు వేయాల్సి వస్తోంది.  గ్రేటర్​ పరిధిలో 1500 మంది వరకు కాంట్రాక్టర్లు ఉన్నారు. 400 మంది  యాక్టివ్ గా పనులు చేస్తున్నారు. ఏడాది కిందట చేసిన పనులకు కూడా జీహెచ్ఎంసీ బిల్లులు ఇవ్వలేదు. స్పెషల్ గ్రాంట్ అంటూ పీపీఎం (పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్) వర్క్స్  కింద రోడ్లు వేయించినప్పటికీ ఆ బిల్లుల గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాది దాటినా  బిల్లులు ఇవ్వకపోతే పనులు ఎలా చేస్తామని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఇవి కాకుండా రెగ్యులర్ పనుల బిల్లులు రూ. వెయ్యి కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి.  బల్దియా వద్ద ఫండ్స్​ లేకపోవడంతోనే ఈ బిల్లులను పెండింగ్​లో పెట్టినట్లు తెలుస్తోంది. ‘సిటీ అభివృద్ధికి ఎన్ని డబ్బులైనా ఖర్చు చేయండి. నిధులు లేకపోతే నాకు చెప్పండి. విడుదల చేస్తా’ అంటూ ఇటీవల మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన ఓ  సమావేశంలో  బల్దియా అధికారులతో మాట్లాడిన ఆయన సిటీలో ఏర్పాటు చేసిన టాయిలెట్లు క్లీన్ గా లేవని  ఫైర్ అయ్యారు. దీంతో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు నిధులు లేవని అధికారులు మంత్రితో చెప్పారు. ఫండ్స్ గురించి టెన్షన్ అవసరం లేదని..  కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.  మంత్రి ఆదేశాల తర్వాతైనా బిల్లులు వస్తాయని కాంట్రాక్టర్లు ఆశించారు. కానీ అధికారులు నయా పైసా ఇవ్వకపోవడంతో  కొత్తగా పనులు చేసేందుకు వారు ఇంట్రెస్ట్​ చూపట్లేదు.

ఐదారుసార్లు టెండర్లు..

గ్రేటర్​ పరిధిలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు టెండర్లను  రీ కాల్​ చేస్తున్నారు. కొన్ని సర్కిళ్లలో ఐదారు సార్లు టెండర్లు వేసినా ఫలితం ఉండట్లేదు.  ప్రస్తుతం 238 టెండర్లు వేయగా.. ఇందులో రీ కాల్ చేసినవి చాలా వరకు ఉన్నాయి. బేగంబజార్​ డివిజన్​లో 3 చోట్ల ఐరన్ గిర్డర్స్ ఏర్పాటు చేసేందుకు 5 సార్లు టెండర్లు వేసినా ఒక్క కాంట్రాక్టర్ కూడా రాలేదు. దీంతో అక్కడ ఆరోసారి టెండర్ వేశారు. వెస్ట్ మారేడు పల్లిలోని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఐదోసారి టెండర్ వేశారు. గ్రేటర్ పరిధిలో చూస్తే సికింద్రాబాద్ జోన్ లో రీ కాల్ టెండర్లు ఎక్కువగా ఉన్నాయి. వానాకాలానికి ముందే పూర్తి చేయాల్సిన నాలాల పూడిక తీత పనులు నేటికీ అసంపూర్తిగా ఉన్నాయి. ఈ పనులకు సంబంధించి 2 నెలల క్రితమే టెండర్లు వేసినప్పటికీ కాంట్రాక్టర్లు ఇంట్రెస్ట్ చూపలేదు. బంజారాహిల్స్, టోలిచౌకి, హిమాయత్ నగర్ తో పాటు చాలా ఏరియాల్లో నాలాల పూడిక తీత పనులు చేపట్టకపోవడంతో చెత్త పేరుకుపోయి ఉంది. టోలిచౌకిలో నాలాకు ఫెన్సింగ్ సరిగా లేకపోవడంతో రాత్రి వేళల్లో వాహనదారులు  అందులో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల రిపేర్ పనులు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కొన్నింటి కోసం ఇప్పుడు టెండర్లు వేస్తున్నారు. బండ్లగూడలోని సుర్రం చెరువు తూము పనుల కోసం ఇటీవల టెండర్లను పిలిచారు.

నాలా పనులు తొందరగా పూర్తి చేయాలె: మేయర్​

నాలాల పనులను తొందరగా పూర్తి చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​తో కలిసి అంబర్ పేటలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. గోల్నాకలోని నాలాను పరిశీలించిన ఆమె డీసిల్టింగ్ పనులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బాపూజీనగర్ డ్రైనేజీ లేన్​లో  చెత్త వేయకుండా చూడాలన్నారు. స్ర్టామ్​ వాటర్ లేన్, డ్రైనేజీ లేన్ రెండూ కలిపి ఉంచడం వల్ల డ్రైనేజీ బ్లాక్ అవుతోందని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె అధికారులతో చెప్పారు. ఫీవర్ హాస్పిటల్ దగ్గర  నాలాను పరిశీ లించిన మేయర్ డీసిల్టింగ్​లో భాగంగా 3 అడుగుల లోతుగా తీసి చెత్తను క్లీన్ చేయించాలని మెడికల్ ఆఫీసర్​కు సూచించారు. మేయర్ విజయలక్ష్మి వెంట కార్పొరేటర్లు మహాలక్ష్మి, ఉమారాణి, అమృత, లావణ్య, పద్మ, డీసీ వేణు గోపాల్, ఈఈ  శంకర్ తదితరులు ఉన్నారు. 

 ఏడాదైనా బిల్లులు ఇవ్వకపోతే ఎలా?

 పీపీఎం పనులంటూ ఏడాది కింద రోడ్లు వేశాం. ఆ బిల్లులు ఇంకా  ఇవ్వలే. రెగ్యులర్​ పనుల బిల్లులు నెలల తరబడి పెండింగ్​లోనే ఉన్నాయి.  ప్రస్తుతం రూ. వెయ్యికోట్లపైగా బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. టైమ్​కి బిల్లులు చెల్లించకపోతుండటంతో కాంట్రాక్టర్లు అప్పుల పాలవుతున్నారు. లేబర్​కి జీతాలు ఇచ్చేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుల్లేక ఇప్పటికే కొందరు పనులు చేస్తలేరు. వెంటనే బిల్లులు చెల్లిస్తే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు వస్తరు. 
– సురేందర్ సింగ్, కాంట్రాక్టర్