- బల్దియాలో టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు వస్తలేరు
- వాహనాల కండీషన్‌తో ఇంట్రెస్ట్ చూపడంలేదు
- పైసలు లేకుండా పనులు చేసేదెట్లంటూ వెనకడుగు
- నిధులు కేటాయిస్తేనే వస్తారంటున్న ఎక్స్పర్ట్స్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో నాలాల విస్తరణ జరిగేటట్లు కనిపిస్తలేదు. పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి జోన్లో ఒకటి చొప్పున ఆరు జోన్లలో కలిపి30 కిలోమీటర్ల మేర నాలాలను విస్తరించేందుకు బల్దియా టెండర్లు వేసినా కాంట్రాక్టర్లు ముందుకొస్తలేరు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఇంట్రెస్ట్ చూపడంలేదు. దీనికి తోడు నాలాల విస్తరణకు సంబంధించి కొన్ని కండీషన్స్ పెట్టడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. నాలాల్లోని పూడికను తరలించేందుకు ముందుగా స్పెషల్ వెహికల్స్ తీసుకోవాలని కండీషన్ ఉండడం, వాటిని కొనాలంటే దాదాపు రూ.50 లక్షల వరకు అవుతుండగా కాంట్రాక్టర్లు టెండర్లు వేసేందుకు వస్తలేదని సమాచారం. చిన్న పనులకు పెద్ద మొత్తం ఖర్చు చేస్తే గిట్టుబాటు కాదని కూడా పనులను దక్కించుకునేందుకు ఇంట్రెస్ట్చూపడం లేదు. దీంతో నాలాల విస్తరణ పనులు ఇప్పుడైనా జరుగుతాయా? లేదా అన్న దానిపై క్లారిటీ లేదు.
858 కోట్లు ఎక్కడ..?
గతేడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎన్డీపీ(స్టాటజిక్నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్) ప్రాజెక్ట్‌ను అమలులోకి తెచ్చింది. నాలాల విస్తరణను త్వరలోనే పూర్తి చేస్తామని అప్పట్లో మంత్రి కేటీఆర్‌కూడా ప్రకటించారు. గ్రేటర్లో రూ.858 కోట్లతో నాలాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఎస్ఎన్డీపీ ద్వారా పనులు నిర్వహిస్తామని చెప్పినా నిధులు మాత్రం రిలీజ్ చేయలేదు. దీంతో ఫండ్స్లేకుండానే పనులు చేపడతామనడంపై కూడా ఇప్పడు కాంట్రాక్టర్లలో నమ్మకం కలగడంలేదు. పనులు చేశాక బిల్లులు రాకపోతే పరిస్థితి ఎంటనేది తెలియక ఆలోచనలో పడ్డారు. బిల్లులు వస్తాయని అధికారుల సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా ముందుకు రావడంలేదు. ముందుగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే పనులు చేసేందుకు వస్తారని నిపుణులు అంటున్నారు. ఫండ్స్ లేకుండా పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులను అడిగినా ఎలాంటి సమాధానం చెప్పడంలేదు.