- గతేడాది బకాయి రూ. 80 కోట్లు ఉండడంతో ఇంట్రస్ట్ చూపని కాంట్రాక్టర్లు
- ఇప్పటికి రెండు సార్లు టెండర్లు పిలిచిన ఆఫీసర్లు
- ఆరు జిల్లాల్లో ఒక్క టెండర్ కూడా దాఖలు కాని వైనం
మెదక్, వెలుగు : చేప పిల్లల పంపిణీకి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గతేడాది సరఫరా చేసిన పిల్లలకు సంబంధించిన బకాయి భారీ మొత్తంలో ఉండడంతో ఈ సారి టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో చేప పిల్లల పంపిణీకి రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఆరు జిల్లాల్లో ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు.
రూ. 100 కోట్లతో 86 కోట్ల చేప పిల్లలు
రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 32 జిల్లాల పరిధిలో ఉన్న 26,357 చేపల చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో చేపల పెంపకం కోసం రూ.100 కోట్ల వ్యయంతో 86 కోట్ల విత్తన చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విత్తన చేప పిల్లల పంపిణీ కోసం ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ గత నెలలో టెండర్లు పిలిచింది. జులై 23వ తేదీ వరకు టెండర్ల దాఖలుకు అవకాశం ఇచ్చారు. అయితే గతేడాది సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించి రూ.80 కోట్ల బకాయి ఉండడంతో ఈ సారి టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు.
రెండోసారి ఆరు జిల్లాల్లో నిల్
మొదట సారి ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడంతో ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు. తర్వాత మరోసారి టెండర్లు పిలిచారు. టెండర్లను ఈ నెల 13న ఓపెన్ చేయగా 26 జిల్లాలకు మాత్రమే టెండర్లు దాఖలు అయ్యాయి. మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో చేప పిల్లల పంపిణీకి ఒక్క టెండర్ కూడా రాలేదు. రెండు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాల్లో చేప పిల్లల సరఫరా ఎలా చేస్తారన్న దానిపై సందిగ్ధం నెలకొంది.
డైరెక్టర్‌కు లెటర్ రాశాం
మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం జిల్లాలో రెండోసారి టెండర్లు పిలిచాం. అయినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయమై ఫిషరీస్ డైరెక్టర్‌కు లెటర్ రాశాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– మల్లేశం, మెదక్ జిల్లా ఫిషరీస్ ఆఫీసర్