పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి: డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా

పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి: డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా
  • మూడేండ్లుగా చెల్లించలే..అప్పు తీసుకొచ్చి పనులు చేసినం
  • బిల్లుల రిలీజ్​కు కమీషన్లు అడుగుతున్నారని ఆరోపణ

హైదరాబాద్ / ఖైరతాబాద్, వెలుగు: మూడేండ్లుగా పెండింగ్​లో ఉన్న తమ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. బిల్లులు రిలీజ్ చేసేందుకు కొందరు 20 శాతం కమీషన్లు అడుగుతున్నారని, అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి మరీ పనులు చేశామని, వాటికి వడ్డీలు కట్టేందుకే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కమీషన్లు ఇచ్చేందుకు తమవద్ద డబ్బుల్లేవంటూ సెక్రటేరియెట్​లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ఎదుట కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది కాంట్రాక్టర్లు శుక్రవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టిని కలిసేందుకు వచ్చారు. 

భట్టిని కలిసేందుకు ఆయన సెక్యూరిటీ సిబ్బందితో పాటు సెక్రటేరియెట్ రక్షణ బాధ్యతలు చూసే ఎస్పీఎఫ్ సిబ్బంది ఒప్పుకోలేదు. దీంతో కాంట్రాక్టర్లు.. భట్టి చాంబర్ ముందే ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడేండ్లుగా తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. 

బడా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయిగానీ.. తమకు ఇవ్వడానికి ఉండవా? అని నిలదీశారు. కాంట్రాక్టర్లంతా ఆందోళన చేస్తున్న టైమ్​లోనే డిప్యూటీ సీఎం భట్టి సెక్రటేరియెట్ నుంచి వెళ్లిపోయారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయానికి అంటే 2023, డిసెంబర్ 7 నాటికి రూ.44వేల కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి.

బిల్లులు రిలీజ్ చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తం

రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ నెల 20లోపు రూ.505 కోట్లు రిలీజ్ చేయకపోతే 25న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించింది. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో అసోసియేషన్ అధ్యక్షుడు శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ మాట్లాడారు. ‘‘గత బీఆర్ఎస్ హయాం నుంచి మాకు బిల్లులు చెల్లించలేదు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా స్పందించలేదు. ఈ నెల 20వ తేదీలోపు బిల్లులు విడుదల చేయకపోతే.. కుటుంబాలతో కలిసి 25న అసెంబ్లీని ముట్టడిస్తాం. పనులు పూర్తి చేసేందుకు 12శాతం వడ్డీకి అప్పులు తీసుకొచ్చాం. అన్ని విభాగాల నుంచి సివిల్ కాంట్రాక్టర్లకు రూ.505 కోట్లు రావాల్సి ఉన్నాయి. వాటిలో రూ.10 లక్షల్లోపు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు 6వేల మందికి వరకు ఉన్నరు. 

ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తూ.. చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులుపెడ్తున్నరు’’అని ఆరోపించారు. సమావేశంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్.కిషన్​రావు, సలహాదారు కొప్పుల అజయ్ కుమార్, రవీందర్ నాయక్ పాల్గొన్నారు.