
- జిల్లా, ప్రాజెక్టుల వారీ టెండర్ల స్థానం జోనల్ విధానం
- అయినా ఆగని అవినీతి, అక్రమాలు
- రూల్స్ పాటించకుండా చిన్న సైజ్ గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు
మంచిర్యాల, వెలుగు: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన కోడి గుడ్లను కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు స్వాహా చేసేస్తున్నారు. రూల్స్‌కు విరుద్ధంగా చిన్న సైజు గుడ్లను సప్లై చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అక్రమాలను అరికట్టేందుకు బీఆర్ఎస్సర్కార్ గతంలోనే జోనల్టెండర్ సిస్టమ్ ను తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది.
గతంలో ఉన్న జిల్లా టెండర్విధానం ద్వారా చిన్న కాంట్రాక్టర్లు లాభపడగా, ఇప్పుడు వారితో పాటు జోనల్ స్థాయిలోని పెద్ద కాంట్రాక్టర్లు సైతం జేబులు నింపుకుంటున్నారు. కొంత మంది ఆఫీసర్లకు ముడుపుల ఆశచూపి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.
54.25 కోట్ల ఎగ్స్‌కు టెండర్లు
అంగన్వాడీ సెంటర్లకు ఎగ్స్ సప్లై చేసేందుకు గతంలో జిల్లా స్థాయిలో ఐసీడీఎస్ప్రాజెక్టుల వారీగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ (డీడబ్ల్యూవో) ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించేవారు. కాంట్రాక్టర్లు అగ్మార్క్ ప్రమాణాలను పాటించకుండా నాసిరకమైన, చిన్న సైజు ఎగ్స్సప్లై చేసేవారు. 45 నుంచి 52 గ్రాముల బరువు ఉన్న ఎగ్స్ సప్లై చేయాల్సి ఉండగా, 30 నుంచి 35 గ్రాముల బరువైన ఎగ్స్ ను ఇస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ అక్రమాలను అరికట్టేందుకు బీఆర్ఎస్ సర్కార్ జోనల్టెండర్ సిస్టమ్ ను తీసుకొచ్చింది. గతేడాది జనవరిలో టెండర్లు పిలువగా వాటిని రద్దు చేయాలంటూ పాత కాంట్రాక్టర్లు హైకోర్టులో కేసు వేశారు. చివరకు మే నెల నుంచి జోనల్టెండర్విధానం అమల్లోకి వచ్చింది. రెండేండ్ల కాలపరిమితితో రాష్ట్రంలోని ఏడు జోన్లకు కలిపి 54.25 కోట్ల ఎగ్స్ సప్లైకి ఆర్డర్ఇచ్చారు.
ఆగని అక్రమాలు
జోనల్ టెండర్విధానంలో పౌల్ట్రీ ఫామ్స్ నిర్వాహకులు టెండర్లో 40 శాతం ఎగ్స్ఉత్పత్తి కెపాసిటీని కలిగి ఉండి, మిగతా 60 శాతం ఎగ్స్ ను బయట కొనుగోలు చేసి సప్లై చేయవచ్చు. అగ్మార్క్నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ 45 నుంచి 52 గ్రాముల బరువున్న నాణ్యమైన ఎగ్స్ ను మాత్రమే సప్లై చేయాలి. కానీ జోనల్టెండర్లు దక్కించుకున్న బడా వ్యక్తులు తిరిగి పాత వారికే సబ్కాంట్రాక్ట్అప్పగించారు. దీంతో గతంలో మాదిరిగానే అక్రమాలు కొనసాగుతున్నాయి. మార్కెట్లో సగం రేటుకే దొరికే చిన్న సైజు గుడ్లను కొనుగోలు చేసి అంగన్వాడీ సెంటర్లకు సప్లై చేస్తున్నారు. ఈ దోపిడీలో జోనల్ టెండరుదారులు, సబ్‌కాంట్రాక్టర్లు, అధికారులు వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల మంచిర్యాల కలెక్టర్బదావత్సంతోష్ జైపూర్ మండలంలోని పలు అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసి చిన్న సైజు గుడ్లను గుర్తించారు. కలెక్టర్ఆదేశాలతో డీడబ్ల్యూవో చిన్నయ్య జిల్లాలోని నలుగురు సీడీపీవోలతో పాటు జోనల్టెండర్ కాంట్రాక్టర్ రజిత, పౌల్ట్రీ నిర్వాహకులకు మెమోలు జారీ చేశారు. ఒక్క జైపూర్మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నాసిరకం గుడ్లు సప్లై చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
అవినీతి, పర్యవేక్షణ లోపంతోనే....
అంగన్వాడీ సెంటర్లపై ఆఫీసర్ల పర్యవేక్షణ లోపించడంతో పాటు కొందరు ఆఫీసర్ల అవినీతి వల్లే కాంట్రాక్టర్లు యథేచ్ఛగా చిన్న సైజు గుడ్లను సప్లై చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు నెలలో రెండు బ్యాచ్‌లుగా ఎగ్స్ సప్లై చేస్తారు. చిన్న సైజు, నాసిరకం గుడ్లు వేసినప్పుడు వాటిని అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలి. కానీ కొంతమంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వాళ్లు ఏవి ఇస్తే అవే తీసుకుంటున్నారు. అంగన్వాడీ సెంటర్లను పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్లు, వారిపైన ఉండే సీడీపీవోలు సైతం ముడుపులకు ఆశపడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి క్వాలిటీ ఎగ్స్సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.