కాంట్రాక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కోట్లు గడిస్తున్నరు

కాంట్రాక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి కోట్లు గడిస్తున్నరు
  • రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తున్నది: వివేక్​ వెంకటస్వామి
  • పోలీసుల అండతో టీఆర్​ఎస్​ లీడర్లు గూండాల్లా వ్యవహరిస్తున్నరని ఆరోపణ
  • జయశంకర్​ భూపాలపల్లి జిల్లా స్తంభంపల్లిలో సమ్మక్క, -సారలమ్మకు మొక్కులు

మహాముత్తారం, వెలుగు: రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తున్నదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. ఉద్యమకారులకు ఎక్కడ న్యాయం జరిగిందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ డెవలప్‌మెంట్ కోసమే పని చేస్తున్నారని, అన్ని పదవులతో పాటు కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు దండుకుని రాష్ట్రాన్ని అవినీతి మయంగా మార్చారని దుయ్యబట్టారు. ‘‘అధికారం ప్రజల కోసమా? ఫ్యామిలీ కోసమా?’’  అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టును మేఘా కృష్ణారెడ్డికి తాకట్టుపెట్టి లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఆనాడు తెలంగాణ వ్యతిరేకులైన ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇప్పుడు కాంట్రాక్టులు అప్పగించి కోట్లు గడిస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల అండతో టీఆర్ఎస్  నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. గురువారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి (పీపీ)లో  సమ్మక్క---- సారలమ్మ జాతరకు వివేక్​ వెంకటస్వామి హాజరై.. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు గ్రామస్థులు, కార్యకర్తలు పూలదండలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో స్తంభంపల్లి గ్రామస్తుల పాత్ర ఎంతో ఉందని 
గుర్తుచేసుకున్నారు. 
మోడీ దిష్టిబొమ్మలను కాలబెట్టడం అవివేకం
ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని వివేక్​ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ లీడర్లు ప్రధాని మోడీ దిష్టి బొమ్మలను కాలబెట్టడం వారి అవివేకమని మండిపడ్డారు. కరోనా కాలంలో ప్రధాని ఎక్కడా  రాజీపడకుండా, పేదలకు ఫ్రీగా బియ్యం పంపిణీ చేశారని,  దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టారని అన్నారు. కేంద్రంలో అవినీతి లేని పాలనను  బీజేపీ కొనసాగిస్తున్నదని, పేదల కోసం పీఎం కిసాన్ లాంటి అనేక స్కీములు ప్రవేశపెట్టిందని వివరించారు. ఇటీవల బడ్జెట్​లో  80 లక్షల ఇండ్ల కోసం ఫండ్స్  కేటాయించారని, గ్రామాల అభివృద్ధి కోసం  15 ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్​ కేటాయిస్తున్నారని చెప్పారు. వివేక్​ వెంకటస్వామి వెంట బీజేపీ స్టేట్​ లీడర్​ చంద్రుపట్ల సునీల్​రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కన్నం యుగదీశ్వర,  మండల అధ్యక్షుడు  పిల్లమరి సంపత్, నేతలు విజయరెడ్డి, పసుల శివ, మేడిపల్లి పూర్ణ చందర్, పాగే రంజిత్,  దుర్గం తిరుపతి, అజ్మీరా కిరణ్, నవీన్​ నాయక్​, ​శ్రీకాంత్ పటేల్, సూరం మహేశ్​,  గంటా అంకన్న, మానేటి శేఖర్​ ఉన్నారు.