ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ అర్బన్‌‌, వెలుగు : పేద విద్యార్థుల చదువుకు సహకారం అందిస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి ప్రతీక్‌‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పలు కాలేజీలు, స్టూడెంట్లకు ఆర్థికసాయం అందజేశారు. నల్గొండలోని ఎన్‌‌జీ కాలేజీకి రూ. 10 లక్షలు, ప్రతీక్‌‌రెడ్డి మెమోరియల్‌‌ జూనియిర్‌‌ కాలేజీకి రూ.15 లక్షలు, ఉమెన్స్‌‌ డిగ్రీ కాలేజీకి రూ.10 లక్షలతో పాటు, ఇంటర్‌‌ ఫస్ట్‌‌ ఇయర్‌‌లో సెకండ్‌‌ ర్యాంక్‌‌ సాధించిన తేజస్వినికి రూ.25 వేలు, ఎంబీబీఎస్‌‌లో సీటు సాధించిన మాన్యంచెల్కకు చెందిన కె.అలివేలుకు రూ.75 వేలు ఇచ్చారు. అలాగే ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలిచిన వారికి ప్రైజ్‌‌ మనీ అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్‌‌రెడ్డి మాట్లాడుతూ పేద స్టూడెంట్లు తనను కలిస్తే వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ బాలికల జూనియర్‌‌ కాలేజీని సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్‌జీ కాలేజీ ప్రిన్సిపాల్‌‌ డాక్టర్‌‌ ఘన్‌‌శ్యామ్‌‌, లైబ్రేరియన్లు సుంకరి రాజారాం, దుర్గాప్రసాద్, గర్ల్స్​కాలేజీ ప్రిన్సిపాల్‌‌ మునావర్‌‌ అమీనా, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌‌ ఇన్‌‌చార్జి నిరంజన్‌‌రెడ్డి, ప్రతీక్​ ఫౌండేషన్‌‌ సీఈవో ఎంవీ.గోనారెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, దైద రవీందర్‌‌ పాల్గొన్నారు.

అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం

తుంగతుర్తి, వెలుగు : అన్ని మతాలకు రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌కుమార్‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో క్రిస్మస్‌‌ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్‌‌ కట్‌‌ చేశారు. అనంతరం దుస్తులు పంపిణీ చేసి మాట్లాడారు. అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం తరఫున దుస్తులు అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం తిరుమలగిరి మార్కెట్ యార్డులో హమాలీ, దడువాయి, స్వీపర్లకు దుస్తులను పంపిణీ చేశారు. అలాగే మినీ స్టేడియం నిర్మాణం కోసం మార్కెట్‌‌ ఆవరణలో స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. మార్కెట్ అభివృద్ధి కోసం సహకరిస్తానని హామీ ఇచ్చారు. అడిషనల్‌‌ కలెక్టర్‌‌ ఎస్.మోహన్‌‌రావు, తహసీల్దార్‌‌ రమణారెడ్డి, మున్సిపల్‌‌ చైర్‌‌పర్సన్‌‌ పోతరాజు రజని రాజశేఖర్, మార్కెట్ చైర్‌‌పర్సన్‌‌ కొమ్మినేని స్రవంతి సతీశ్‌‌, ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, మున్సిపల్‌‌ వైస్‌‌ చైర్మన్‌‌ సంకేపల్లి రఘునందన్‌‌రెడ్డి, జడ్పీటీసీ ధూపటి అంజలి పాల్గొన్నారు.

పోరాటాలకు సిద్ధం కావాలి

నకిరేకల్‌‌, వెలుగు :​ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలపై పోరాటాలకు కాంగ్రెస్‌‌ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య సూచించారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు జనవరి 26 నుంచి రెండు నెలల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రాహుల్‌‌ గాంధీ జోడో యాత్రపై ప్రచారం చేయడంతో పాటు, గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి, గ్రామాల్లో జెండావిష్కరణలను చేయనున్నట్లు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా, మండల కమిటీలను రద్దు చేసినట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టించి పనిచేసే వారికే పదవులు దక్కుతాయని, కొత్తగా ప్రకటించిన టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి జిల్లాలో ఎస్సీ వర్గాలకు సముచిత స్థానం దక్కిందన్నారు. సమావేశంలో నాయకులు జటంగి వెంకట నరసయ్య, లింగాల వెంకన్న, కోట పుల్లయ్య, మహేందర్‌‌రెడ్డి, బొంబాయి శ్రీను, బడుగుల చంద్రశేఖర్, కొండల్, అంతయ్య, నగేశ్‌‌, కిరణ్‌‌ పాల్గొన్నారు.

రాచకొండను టెంపుల్ సిటీగా మారుస్తాం

చౌటుప్పల్‌‌, వెలుగు : రాచకొండ ప్రాంతాన్ని టెంపుల్‌‌ సిటీగా డెవలప్‌‌ చేసేందుకు కృషి చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌రెడ్డి చెప్పారు. మంగళవారం యాదాద్రి కలెక్టర్‌‌ పమేలా సత్పతితో కలిసి సంస్థాన్‌‌ నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పురాతన ఆలయాలు, మెట్ల బావులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో మంత్రి కేటీఆర్‌‌తో మాట్లాడి రాచకొండలోని మెట్ల బావులను పునర్నిర్మిస్తామని చెప్పారు. వారి వెంట జాయింట్‌‌ కలెక్టర్‌‌ దీపక్‌‌ తివారి, ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్‌‌చందర్‌‌రెడ్డి, జడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేశ్‌‌గౌడ్‌‌ పాల్గొన్నారు.

కాలేజీ స్థలాన్ని కాపాడాలి

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్థలం కబ్జాకు గురికాకుండా కాపాడాలంటూ స్టూడెంట్లు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌‌ఎఫ్‌‌ఐ, యూత్‌‌ కాంగ్రెస్‌‌, ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మోత్కూరు అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌‌ కాలేజీ వెనుక ఉన్న స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆఫీసర్లు స్పందించి స్థలాన్ని రక్షించాలని డిమాండ్‌‌ చేశారు. సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించిన అనంతరం ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎస్‌‌ఎఫ్‌‌ఐ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బుర్రు అనిల్‌‌కుమార్‌‌, యూత్‌‌ కాంగ్రెస్‌‌ జిల్లా నాయకుడు మందుల సురేశ్‌‌, ఏబీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వడ్లకొండ వేణు పాల్గొన్నారు.