కాంగ్రెస్​ కన్నా బీఆర్ఎస్​కే దండిగా చందాలు!

కాంగ్రెస్​ కన్నా బీఆర్ఎస్​కే దండిగా చందాలు!
  • 2023-24లో గులాబీ పార్టీకి 580 కోట్ల విరాళాలు
  • జాతీయ పార్టీ కాంగ్రెస్​కు వచ్చిన డొనేషన్లు రూ.288 కోట్లే
  • రూ.2,244 కోట్లతో టాప్​లో ఉన్న  బీజేపీ
  • అన్ని పార్టీలకూ ప్రూడెంట్​ఎలక్టోరల్​ ట్రస్ట్​ విరాళాలు
  • కంట్రిబ్యూషన్​ రిపోర్టు వివరాలను వెబ్​సైట్​లో పెట్టిన ఎన్నికల కమిషన్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా.. జాతీయ పార్టీ కాంగ్రెస్​ కన్నా ఎక్కువ విరాళాలు  వచ్చాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను గులాబీ పార్టీకి​రూ.580.52 కోట్ల మేర విరాళాల రూపంలో అందాయి. అందులో రూ.85 కోట్లు ప్రూడెంట్​ ఎలక్టోరల్​ ట్రస్ట్ ద్వారా వచ్చాయి. మిగతా రూ.495.52 కోట్లు ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా అందాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీకి వచ్చిన విరాళాలు కేవలం రూ.288.9 కోట్లే కావడం గమనార్హం. 

దేశంలోని వివిధ పార్టీలకు చెందిన కంట్రిబ్యూషన్​ రిపోర్టులను కేంద్ర ఎన్నికల కమిషన్​ వెబ్​సైట్​లో పొందుపరిచింది. రూ.20 వేల కన్నా ఎక్కువ వచ్చిన విరాళాల జాబితాను.. డొనేట్​ చేసిన వారి వివరాలతో సహా ఈసీ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్​ఎస్ కు రూ.683.06 కోట్ల మేర విరాళాలు రాగా.. అందులో రూ.529.03 కోట్లు ఎలక్టోరల్​ బాండ్ల రూపంలో అందాయి. 2022తో పోలిస్తే 2023లో విరాళాలు రూ.వంద కోట్ల మేర తగ్గాయి.

అగ్రస్థానంలో బీజేపీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. విరాళాల విషయంలో ఏ పార్టీకీ అందనంత ఎత్తులో ఉంది. ఏకంగా రూ.2,244 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే బీజేపీకి వచ్చిన విరాళాల్లో  మూడు రెట్ల(212 శాతం) పెరుగుదల నమోదైంది. 2019 జనరల్​ ఎలక్షన్స్​కు ముందు బీజేపీకి వచ్చిన విరాళాలు కేవలం రూ.742 కోట్లు కాగా.. ఇప్పుడు అంతకుమించి వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్​ పార్టీకి 2022లో వచ్చిన రూ.79.9 కోట్ల విరాళాలతో పోలిస్తే ఇప్పుడు మూడింతల విరాళాలు అందాయి. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్​కు వచ్చిన విరాళాలు రూ.146.8 కోట్లు. ఈ ఐదేండ్లలో కాంగ్రెస్​కు కేవలం రెండింతల మేర విరాళాలు పెరగ్గా.. బీజేపీకి మాత్రం మూడున్నర రెట్ల మేర పెరిగాయి. ఇక, ఈ ఏడాది టీడీపీకి రూ.వంద కోట్లు, వైసీపీకి184 కోట్ల విరాళాలు సమకూరాయి. 

ఎలక్టోరల్​ ట్రస్ట్​ల ద్వారా ఎక్కువ ఆదాయం

వివిధ పార్టీలకు ఎలక్టోరల్​ ట్రస్టుల ద్వారా విరాళాల ఆదాయం ఎక్కువ వచ్చినట్టు తేలింది. దాదాపు అన్ని పార్టీలకూ ప్రూడెంట్​ ఎలక్టోరల్​ ట్రస్ట్​ అనే సంస్థ విరాళాలను ఇచ్చింది. బీజేపీకి ఎలక్టోరల్​ ట్రస్టుల ద్వారానే రూ.850 కోట్ల మేర విరాళాలు రాగా.. ప్రూడెంట్​ ద్వారా వచ్చినవే రూ.723 కోట్లు కావడం గమనార్హం. మిగతా రూ.127 కోట్లు ట్రయంఫ్​ ఎలక్టోరల్​ ట్రస్ట్​, రూ.17.2 లక్షలు ఐంజిగార్టిగ్​ ఎలక్టోరల్​ ట్రస్ట్​ ద్వారా వచ్చాయి. 

కాంగ్రెస్​ పార్టీకి ఒక్క ప్రూడెంట్​ ఎలక్టోరల్​ ట్రస్ట్​ ద్వారానే రూ.156 కోట్లు వచ్చాయి. ఇటు బీఆర్​ఎస్​కు రూ.85 కోట్లు, వైఎస్సార్​సీపీకి రూ.62. 5 కోట్ల మేర ప్రూడెంట్​ ట్రస్ట్​ విరాళాలను అందజేసింది. మాయావతి నేతృత్వంలో కొనసాగుతున్న బహుజన్​ సమాజ్​వాదీ పార్టీ (బీఎస్పీ), నవీన్​ పట్నాయక్​ నేతృత్వంలోని బిజూ జనతాదళ్​ లు తమకు అసలు ఒక్క రూపాయి కూడా విరాళాలు రాలేదని వెల్లడించాయి. 

ఎలక్టోరల్​ బాండ్లలోనూ బీజేపీనే టాప్

ఎలక్టోరల్​ బాండ్ల డేటాను ప్రస్తుతం కంట్రిబ్యూషన్​ రిపోర్టుల్లో చెప్పకపోయినా.. ఈ ఏడాది మార్చిలో ఈసీ వెబ్​సైట్​లో పెట్టిన వివరాల ప్రకారం బీజేపీ అత్యధికంగా ఎలక్టోరల్​ బాండ్లను దక్కించుకున్నది. దాదాపు రూ.6,060 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. రూ.1,214.70 కోట్లతో బీఆర్​ఎస్​ నాలుగో స్థానంలో నిలిచింది. బీజేపీకి, బీఆర్​స్​కు మేఘా కంపెనీ ఇచ్చిన మొత్తం కూడా ఎక్కువే కావడం గమనార్హం. మేఘా కొన్న రూ.966 కోట్ల బాండ్లలో ఎక్కువ మొత్తం రూ.584 కోట్లు బీజేపీకి ఇవ్వగా.. బీఆర్​ఎస్​కు రూ.195 కోట్ల మేర ఇచ్చింది. ఏ ఇతర ప్రాంతీయ పార్టీకి కూడా మేఘా సంస్థ ఇంత భారీ మొత్తంలో ఎలక్టోరల్​ బాండ్ల రూపంలో విరాళాలను ఇవ్వలేదు. కాగా, కాంగ్రెస్​ పార్టీకి మొత్తంగా రూ.1,421.90 కోట్లు ఎలక్టోరల్​ బాండ్ల రూపంలో వచ్చాయి.

ఎలక్టోరల్​ బాండ్ల వివరాలు ఇవ్వని పార్టీలు

ఎన్నికల కమిషన్​ వెల్లడించిన కంట్రిబ్యూషన్​ రిపోర్టుల్లో ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలను పార్టీలు వెల్లడించలేదు. కంట్రిబ్యూషన్​ రిపోర్టుల్లో ఎలక్టోరల్​ బాండ్ల డేటాను ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ఆ డేటాను ఇవ్వలేదు. అయితే, బీఆర్​ఎస్​, వైఎస్సార్​సీపీ, డీఎంకే, జార్ఖండ్​ ముక్తి మోర్చా వంటి ప్రాంతీయ పార్టీలు ఎలక్టోరల్​ బాండ్ల డేటాను వెల్లడించాయి. 

కంట్రిబ్యూషన్​ రిపోర్టుల్లో వెల్లడించిన ఆ లెక్కల ప్రకారం బీఆర్​ఎస్​కు అత్యధికంగా రూ.495.5 కోట్ల మేర ఎలక్టోరల్​ బాండ్ల రూపంలో విరాళాలు సమకూరాయి. వైఎస్సార్​సీపీకి రూ.121.5 కోట్లు, డీఎంకేకు రూ.60 కోట్లు, జేఎంఎంకు రూ.11.5 కోట్ల మేర బాండ్ల రూపంలో విరాళాలు వచ్చినట్టు లెక్కలు చెప్తున్నాయి. అయితే, ఎలక్టోరల్​ బాండ్ల ద్వారా సమకూరిన ఆదాయాన్ని వెల్లడించి ఉంటే బీజేపీ విరాళాల ఖజానా రూ.8 వేల కోట్లపైమాటే ఉండేది.