
న్యూఢిల్లీ: ఓటీటీలు, సోషల్ మీడియాల్లో ప్రసారమవుతున్న అడల్ట్ కంటెంట్‌ను నియంత్రించాలంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్రంతో సహా పలు ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసింది. ఓటీటీలు, సోషల్ మీడియాల్లో అశ్లీల కంటెంట్ ప్రసారాలు పెరిగాయని, వీటిని నిషేధించాలని కోరుతూ ఐదుగురు పిటిషనర్లు సుప్రీం కోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేశారు.
లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించేందుకు నేషనల్ కంటెంట్ కంట్రోల్ అథారిటీని ఏర్పాటుచేసి మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసిహ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత పరిపాలన, కార్యనిర్వాహక వ్యవస్థలది అని తెలిపింది. ఈ అంశం తమ పరిధిలోకి రాదని చెప్పింది. తాము లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అధికారాలను అతిక్రమిస్తున్నామనే ఆరోపణలు ఉన్నాయని తెలిపింది.
ఓటీటీలకు సెన్సార్ బోర్డు..
ఇటీవల న్యాయ వ్యవస్థపై జరిగిన దాడుల గురించి జస్టిస్ బీఆర్ గవాయి ప్రస్తావించారు. ‘‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న అశ్లీల కంటెంట్‌పై కేంద్రం తన అభిప్రాయం తెలియజేయాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్ కారణంగా పిల్లలు, యువతతో పాటు పెద్దల ఆలోచనలు కూడా చెడుగా మారిపోతాయి’’ అని ధర్మాసనం తెలిపింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఓటీటీలు, సోషల్ మీడియాల్లో ప్రసారం అవుతున్న అడల్ట్ కంటెంట్‌కు సంబంధించి కొన్ని నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్నింటిని అమలుచేస్తామన్నారు. పిటిషనర్ల తరఫున అడ్వకేట్ విష్ణు శంకర్ వాదనలు వినిపించారు.
నేషనల్ కంటెంట్ కంట్రోల్ అథారిటీ ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, సినిమాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) లాగా ఓటీటీ కంటెంట్‌ను సర్టిఫై చేయాలని విన్నవించారు. విచారణ టైమ్‌లో పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల పరిధిలోని ఒక ముఖ్యమైన సమస్యను పిటిషనర్ లేవనెత్తారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. ఇప్పటికే పరిపాలన, కార్యనిర్వాహక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నామని తమపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఉల్లు, ఆల్ట్, ఎక్స్ కార్ప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేసింది.