‘ఒక వ్యక్తి అపరిమితమైన స్వేచ్ఛను పొందినప్పుడు అది అశాంతి, అనర్థాలకు దారితీస్తుంది’ అని బ్రిటన్ రాజనీతిజ్ఞుడు, విద్యావేత్త హెచ్‌జే లాస్కీ అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ కొందరు వ్యక్తుల ప్రవర్తన, ధోరణి అలాగే కనిపిస్తోంది. మనిషి సంఘజీవి కావడంతో నేటి డిజిటల్ కాలంలో సోషల్ మీడియా పరిధి, వాడకం విస్తృతంగా పెరిగిపోయాయి. చిన్నారుల నుంచి వృద్ధుల దాకా చేతిలో సెల్ ఫోన్ లేనిదే మనుగడ సాధించలేకపోతున్నారు. ప్రతి వంద మందిలో 60 మందికి పైగా సోషల్ మీడియాలోని ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఐడీ కలిగి ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాతో మంచికంటే చెడే ఎక్కువగా ఉంటుండగా.. రోజురోజుకూ ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోల సమస్య తీవ్రమవుతుండటం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సోషల్ మీడియా సర్వే సంస్థలు వెల్లడించిన డేటా మేరకు.. ఫేస్బుక్ ది ఫస్ట్ ప్లేస్ కాగా.. యూ ట్యూబ్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. వీటి తర్వాత ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, టెలిగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్ చాట్ వంటి వాటిని ఎక్కువమంది ఫాలో అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. కొన్ని న్యూస్ నిజమా? కాదా? అని నిర్థారణ చేసుకోకుండానే చాలామంది షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పై ఏదైనా ఒక ఫొటో, వీడియో వైరల్‌గా మారితే.. అది నిజమో, కాదో తెలుసుకోవడం ఎంతో కష్టసాధ్యంగా మారింది.
‘నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది’ అనే లోకోక్తి తెలిసిందే. ఏ విషయమైనా క్షణాల్లో సోషల్ మీడియాలో
వైరల్‌గా మారుతోంది. ఇందులో పాజిటివిటీ కంటే నెగెటివిటీనే ఎక్కువగా ఉంటోంది. ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోల బారినపడుతున్న వారిలో సెలెబ్రెటీలు, పొలిటీషియన్లు, ఇతర ప్రముఖులు ఉంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో నేడు సమస్య ఎంతో ప్రమాదకరస్థాయికి చేరిపోయింది. తమపై వైరల్ అయ్యే నెగెటివ్ ప్రచారాన్ని ఎలా అడ్డుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను వైరల్ చేయడంలో ఎక్కువగా రాజకీయ రంగానికి చెందినవే ఉంటున్నాయి. దాని తర్వాత మత సంబంధ విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నట్టు పలు సర్వేల ద్వారా తేలింది. ఇటీవలకాలంలో ఫేక్‌న్యూస్, డీప్ వీడియోల బారినపడిన కొందరు బాధిత సెలెబ్రెటీలు, ప్రముఖులు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు, కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తుండటం మీడియాలో చూస్తున్నాం.
తాజా ఐఎస్బీ సర్వేలో ఇలా..
తాజాగా గత డిసెంబర్ లాస్ట్ వీక్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ సైబర్ పీస్ కో ఆర్డినేషన్ సంస్థతో కలిసి ‘ఫ్యాక్ట్ -చెకింగ్ ఇండియా’ పేరిట సర్వే చేసింది. దేశంలో ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోల ముప్పు నానాటికీ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ 77.4% వైరల్ అవుతుండగా.. ఇందులో ట్విట్టర్ (ఎక్స్) ద్వారా 61%, ఫేస్ బుక్ ద్వారా 34% ఎక్కువగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇక సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు 74.89% మంది ఉన్నట్టు పేర్కొంది. వీడియో కంటెంట్ కోసం 68.21% ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపింది.
అదేవిధంగా 18-– 24 ఏండ్ల యువతనే అధికంగా సోషల్ మీడియాను వినియోగిస్తున్నట్టు ఐఎస్బీ తన సర్వేలో వివరించింది. తొలి స్థానంలో రాజకీయ రంగానిది(46 %) కాగా, ఆ తర్వాత కామన్ ప్రాబ్లమ్స్ (33.6 %), మతం (16.8 %) ఉండడమే కాకుండా మొత్తం ఫేక్ న్యూస్ లో 94 % వీటిదే కావడం గమనార్హం.
అంతర్జాతీయ సమస్య
సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి పిల్లలను దూరంగా ఉంచాలనే ఆందోళన అంతర్జాతీయంగా రోజురోజుకూ తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. ఇందుకు సోషల్ మీడియా నియంత్రణకు పలు దేశాల ప్రభుత్వాలే స్వయంగా రంగంలోకి దిగి చట్టాలను తీసుకొచ్చే చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా 16 ఏండ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ పెట్టింది. ఒకవేళ అకౌంట్లను కలిగి ఉన్నట్లు తేలితే సంబంధిత కంపెనీపై భారీగా ఫైన్ వేసేందుకు నిర్ణయించింది. ఆ దేశమే కాకుండా ఫ్రాన్స్, ఇంగ్లండ్ వంటి దేశాలు కూడా సోషల్ మీడియా నియంత్రణకు రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
మనదేశంలోనూ సోషల్ మీడియాను నియంత్రించాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. మరోవైపు సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ కట్టడికి ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినం చేస్తామని ఇటీవల కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలోనూ ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పై జవాబుదారీతనంతోపాటు చర్చ, బాధ్యతాయుతమైన ఆవిష్కరణల ద్వారా ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోలపై నియంత్రణకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మనదేశంలోనూ కట్టడి చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోలు సృష్టించే వ్యక్తులు సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడం తక్షణావసరం. ఇక రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో మితిమీరిన ప్రచారం చేసుకుంటుండగా.. ఫేక్ అకౌంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తమ పార్టీ ప్రయోజనాల కంటే ప్రత్యర్థి పార్టీలపై విష ప్రచారం చేసేందుకే ఎక్కువగా వినియోగిస్తున్నాయి.
ALSO READ : సంక్షేమ రాజ్యం దిశగా అడుగులు!
సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫేక్ న్యూస్ ఎక్కడి నుంచి వస్తుందో.. ఎవరు పంపుతున్నారు అనే స్పష్టమైన వివరాలు ఉండవు. కేవలం ఏదో ఒక ఐడీ నుంచి అప్ లోడ్ అయి వైరల్ అవుతుంది. ఆ ఐడీ కూడా ఫేక్ కావొచ్చు. కొంతమంది వ్యక్తులు కావాలనే ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు.
నియంత్రణ అనివార్యం
రాజకీయాలు, మతాలు, కులాలు, ప్రాంతాలవారీగా ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతున్నట్టు సోషల్ మీడియా టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి విషయం ఆందోళనకరంగా మారుతోందన్నారు. ఇలాంటి ముప్పును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాలకు ఉన్నట్టుగానే సోషల్ మీడియా నియంత్రణకు కచ్చితంగా సెన్సార్ షిప్ వంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చట్టాలను కూడా కఠినం చేస్తేనే ఎంతోకొంత సోషల్ మీడియా నియంత్రణలో ఉంటుంది.
వ్యక్తులు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ పేరిట విపరీత ప్రవర్తన ధోరణి తగ్గించుకోవాలి. అది సమాజానికి ఎంతో అవసరం. లేకపోతే వ్యవస్థలు విఫలమై అశాంతికి దారి తీయవచ్చు. సమాజంలోని పౌరులుగా ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.
- వేల్పుల సురేష్,
సీనియర్ జర్నలిస్ట్