కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన ధరణి పోర్టల్ రాజకీయ పార్టీల ఎన్నికల ఎజెండాలో చేరింది. పోర్టల్ ను తీసుకొచ్చి మూడేండ్లు కావస్తున్నా భూముల చిక్కుముళ్లు ఇంకా వీడకపోవడం, గ్రీవెన్స్ సెల్స్ కు వచ్చే బాధితుల సంఖ్య తగ్గకపోవడంతో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మార్చుకున్నాయి. ధరణి పోర్టల్ తో రైతులకు మంచి జరిగిందని సీఎం కేసీఆర్ ఎన్నికల సభల్లో చెప్తుండగా.. ధరణి వల్ల భూసమస్యలు పెరిగాయని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రతి సభలోనూ ప్రస్తావిస్తున్నారు.
ధరణి పేరిట సీఎం కేసీఆర్ పేదల భూములు కాజేశారని గత రెండు రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలోకి విసిరివేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సభల్లో చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ లో తప్పులను సవరిస్తామని, మార్పులు చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పలుమార్లు ప్రకటించారు.
మొత్తంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రధానాంశాల్లో ధరణి కూడా ఒకటిగా మారింది. అందుకే రాష్ట్రంలోని భూచట్టాల నిపుణులు, ధరణి సమస్యలపై పనిచేస్తున్న కార్యకర్తలు అన్ని పార్టీల మ్యానిఫెస్టోల్లో సమగ్ర భూసర్వే, రెవెన్యూ సదస్సులను ఏర్పాటును చేర్చాలని కోరుతున్నారు.
వెంటాడుతున్న భూరికార్డుల ప్రక్షాళన తప్పిదాలు
ప్రభుత్వ పెద్దలు చెప్తున్నట్లు ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ గతంలోలా నెలలు, ఏళ్ల తరబడి కాకుండా నిమిషాల్లోనే పూర్తవుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా తప్పుగా నమోదైన రికార్డులే తలనొప్పిగా మారాయి. వాస్తవానికి 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో, డేటా ఎంట్రీలో అప్పటి రెవెన్యూ సిబ్బంది, ఆఫీసర్లు చేసిన తప్పిదాలే రైతులను ఇంకా వెంటాడుతున్నాయి.
దీంతో భూసమస్యలకు సమగ్ర పరిష్కారమంటూ సీఎం కేసీఆర్ తీసుకొచ్చినా ధరణి పోర్టలే అనేక భూవివాదాలకు నెలవుగా మారింది. మొదట్లో ధరణిలో సమస్యలు లేవని బుకాయిస్తూ వచ్చిన ప్రభుత్వం.. క్రమంగా వివిధ భూసమస్యల పరిష్కారం కోసం 33 మాడ్యూల్స్ ను, పదుల సంఖ్యలో ఆప్షన్లను విడతలవారీగా తీసుకువచ్చింది. అయినా మాడ్యూల్స్ కు అందని సమస్యలెన్నో మాన్యువల్ గా బాధితుల నుంచి వినతిపత్రాల రూపంలో కలెక్టర్లు, సీసీఎల్ఏకు చేరుతున్నాయి. వారు కూడా చాలా సమస్యలకు పరిష్కారం చూపలేక చేతులెత్తేస్తున్నారు. కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని సలహా ఇస్తున్నారు.
ఇన్ని సమస్యలు
- భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే కొన్నిచోట్ల ఒకరి భూమి మరొకరి పేరు మీద, భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట మ్యుటేషన్ పెండింగ్ లో ఉంటే అమ్ముకున్నవారి పేరు మీద పాస్ బుక్స్ జారీ అయ్యాయి.
- కొన్ని సర్వే నంబర్లు మిస్సయ్యాయి. కొందరికి పాత పాస్ బుక్ లో ఉన్నంత విస్తీర్ణం నమోదు కాలేదు.
- నాన్ లేఔట్ ప్లాట్లు అమ్ముడుపోయినా ఇంకా అవి ధరణిలో వ్యవసాయ భూములుగానే కనిపిస్తున్నాయి. భూములు అమ్ముకున్న పాత పట్టాదారులకు పాస్ బుక్స్ జారీ చేశారు
- సాదాబైనామా కింద అప్లై చేసుకున్న 9.20 లక్షల మందికి సుమారు 20 లక్షల ఎకరాలకు సంబంధించిన పాస్ బుక్స్ రాలేదు. కొత్త రెవెన్యూ చట్టమే వారికి అడ్డంకిగా మారింది. ప్రభుత్వం చట్ట సవరణ చేయకపోవడంతో సాదాబైనామాలకు పాస్ బుక్స్ రావడం లేదు. ఇలాంటి భూములపై ధరణి పోర్టల్ లో పాత పట్టాదారుల పేర్లు వస్తున్నాయి. ఇదే అదనుగా వారు మళ్లీ తమ పేరిట పాస్ బుక్స్ వచ్చేలా చేసుకుని ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు
- వారసత్వంగా వచ్చే భూమిని విరాసత్ చేయడానికి గతంలో తహసీల్దార్లు ఫ్యామిలీ మెంబర్ల సర్టిఫికెట్ తప్పనిసరిగా చూసేవారు. దీంతో వారసులకు అన్యాయం జరిగేది కాదు. ఇప్పుడు సెల్ఫ్ అఫిడవిట్ మాత్రమే అడగడంతో కొందరు తామొక్కరమే వారసులమంటూ మిగతావాళ్లకు తెలియకుండా స్లాట్ బుక్ చేసుకుని విరాసత్ చేయించుకుంటున్నారు. మిగతా వారసులు విషయం తెలుసుకుని ఆలస్యంగా వచ్చి తహసీల్దార్ ను ప్రశ్నిస్తే.. కోర్టులో తేల్చుకోమని సూచిస్తున్నారు.
- రాష్ట్రంలో సుమారు 22 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు దళితులు, పేదల చేతుల్లో ఉన్నాయి. వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి అమ్ముకునే అవకాశం ఇవ్వకపోవడంతో ఆ భూములు వారికి ఉపయోగపడడం లేదు. ఇతర రాష్ట్రాల్లో 10, 15 ఏళ్ల కాలపరిమితి తర్వాత పూర్తి హక్కులు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ శాశ్వత హక్కులు కల్పించాలన్న డిమాండ్ ఉంది. అసైన్డ్ రైతులకు శాశ్వత హక్కులు ఇస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇటీవల సీఎం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఈ విషయపై ఆలోచిస్తామని చెప్పారు.
- ధరణిలో ఏదైనా కారణంతో స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కోసం కట్టిన డబ్బులు వాపస్ రావడం లేదు. మూడేళ్లుగా రూ.వందల కోట్లు రాష్ట్ర సర్కారు ఖజానాలోనే ఉండిపోయాయి.
మ్యానిఫెస్టోల్లో సమగ్ర భూసర్వే చేర్చాలి
రాష్ట్రంలో భూసమస్యల పరిష్కారం కోసం ఏం చేయబోతున్నారనే హామీలను అన్ని రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో చేర్చాలి. రాష్ట్రంలో భూములకు సంబంధించి 124 రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. వాటన్నింటిని ఒకే గొడుగు తీసుకొస్తామని హామీ ఇవ్వాలి. ప్రధానంగా రాష్ట్రంలో భూముల రీసర్వే జరగాలి. రాష్ట్రంలో 80 ఏండ్ల క్రితం సమగ్ర భూ సర్వే జరిగింది. ప్రతి 30 ఏళ్లకోసారి జరగాల్సిన సర్వేను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్న సర్వే రికార్డులన్నీ చైన్లతో మాన్యువల్ గా చేసినవే. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గెట్టు తగాదాలు ఉన్నాయి. రికార్డులో ఒక సర్వే నంబర్ ఉంటే.. వాస్తవ సాగులో ఇంకో సర్వే నంబర్ ఉంది. ప్రస్తుతం ఉన్న చాలా భూసమస్యలకు సమగ్ర భూసర్వేనే పరిష్కారం.
భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు
అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులపై హామీ ఇవ్వాలి
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా భూములు అసైన్ చేసిన 10, 15 ఏండ్ల తర్వాత అసైనీలకు ఆ భూమిపై శాశ్వత హక్కులు కల్పించాలి. ఇటీవల ఏపీ ప్రభుత్వం అసైన్డ్ అయి 20 ఏండ్లు దాటిన భూములపై అసైనీలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. దీంతో 28 లక్షల ఎకరాలు పేదలకు చెందాయి. ఈ విషయంలో వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ, సీఎం కేసీఆర్ ఇటీవల తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలో స్పష్టత లేదు. అన్ని పార్టీలు ఈ అంశాన్ని వారి మ్యానిఫెస్టోల్లో చేర్చాలి. -
రాజ్ కుమార్ రెడ్డి