టీఆర్ఎస్‌‌కు ఓటేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా..

  • వరంగల్‌లో వివాదాస్పద ఫ్లెక్సీ
  • మున్సిపల్ ఎన్నికలకు ముందు అధికారపార్టీకి చేదు అనుభవం

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి కొనసాగుతోంది. నిన్నటి వరకు ఆయా పార్టీలు.. తమ అభ్యర్థుల గెలుపుకోసం ముమ్మరంగా ప్రచారం చేశాయి. కార్పొరేటర్ల గెలుపు కోసం పార్టీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా ప్రచారం చేశారు. మంగళవారంతో ఎన్నికల ప్రచారానికి ముగింపు పడింది. ఇక మరో రెండు రోజుల్లో తెలంగాణలోని అయిదు మున్సిపాలిటీల్లో ఎలక్షన్లు జరగనున్నాయి. 

ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఓ వివాదాస్పద ఫ్లెక్సీ కనిపించింది. ఆ ఫ్లెక్సీలో ‘టీఆర్ఎస్‌ పార్టీకి ఓటేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా… వీలైతే మీ ఇష్టం’అంటూ అర్షం స్వామి అనే వ్యక్తి చెప్పు పట్టుకొని ఉన్న ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ప్రధాన కూడలిలో ఈ ఫ్లెక్సీ కట్టడంతో రోడ్డుపై వెళ్తున్న వారు ఆ ఫ్లెక్సీ చూసి.. దానిలో ఉన్న విషయాన్ని చదివి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఆ వ్యక్తిని ఎంతగానో మోసం చేసి ఉంటారని అనుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారపార్టీకి వ్యతిరేకంగా.. అది కూడా మున్సిపల్ ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ సంఘటన వెలుగులోకి రావడంతో జిల్లాలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.