![ఆస్ట్రేలియా పోస్టాఫీస్ ముందు వివాదాస్పద సైన్ బోర్డు](https://static.v6velugu.com/uploads/2022/11/Australia-Post-Office_KJOwe86LFk.jpg)
- మండిపడిన ఇండియన్లు.. క్షమాపణలు చెప్పిన సంస్థ
అడిలైడ్:ఆస్ట్రేలియాలో పోస్టాఫీసు ముందు పెట్టిన ఒక సైన్‌బోర్డు వివాదాస్పదమైంది. ఇండియన్ల ఫొటోలను తీయలేమంటూ పెట్టిన ఈ బోర్డుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అడిలైడ్‌లోని ఇన్నర్సిటీ పోస్టాఫీస్ ముందు పెట్టిన బోర్డుపై ‘‘వెలుతురు, ఫొటో బ్యాగ్రౌండ్ క్వాలిటీ కారణంగా మేం ఇండియన్ల ఫొటోలు తీయలేం. దగ్గరలోని మరో ఫొటో స్టోర్‌కు వెళ్లాలి. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం”అంటూ జాతి వివక్షను చూపించేలా బోర్డు పెట్టింది.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అక్కడి ఇండియన్లు.. తమ శరీర రంగును అవహేళన చేసేలా ఈ బోర్డు ఉందని విమర్శించారు. ఒక నేషనాలిటీ వారికి సేవలను నిరాకరించడం వివక్ష కిందకే వస్తుందని సోషల్ మీడియాలో ఇండియన్లు ఫైరయ్యారు. ఈ సైన్‌బోర్డును షేర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ బోర్డుకు పెట్టే ఖర్చుతో అక్కడి లైటింగ్‌ను బాగు చేసుకోవచ్చని కామెంట్లు చేశారు.
ఇది ఇండియన్లకు మాత్రమేనా? ఇంకా నల్లగా ఉంటే ఓకేనా? అంటూ మరో నెటిజెన్ ప్రశ్నించారు. ఇది వివక్షతో చేసిన పని కాదని, పదాలను సరిగ్గా వాడకపోవడం వల్ల దొర్లిన తప్పిదమని ఆస్ట్రేలియా పోస్ట్ వివరణ ఇచ్చింది. ఆస్ట్రేలియా పోస్ట్‌లో తీసిన ఫొటోల క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది ఇండియన్ల పాస్ పోస్ట్, వీసా అప్లికేషన్లు రిజెక్ట్ అవుతున్నాయని, అందువల్లే ఈ సైన్ బోర్డును పెట్టామని చెప్పింది.
అందులో వాడిన పదాలు మాత్రం సరికాదని, ఇది క్లియరెన్స్ ఇవ్వకుండానే లోకల్ ఎంప్లాయిస్ ఏర్పాటు చేశారని క్లారిటీ ఇచ్చింది. విషయం తెలిసిన వెంటనే ఆ సైన్ బోర్డును తొలగించామని, జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నామని వెల్లడించింది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.