భద్రాద్రి రామాలయంలో అర్చకులు వర్సెస్ ఈవో.. ముదిరిన రగడ

భద్రాద్రి రామాలయంలో అర్చకులు వర్సెస్ ఈవో.. ముదిరిన రగడ

ఖమ్మం: భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో రేపు(శుక్రవారం, మార్చి 14)న జరిగే వసంతోత్సవం పూజా కార్యక్రమాల కోసం ఈరోజు(మార్చి 13, 2025) యాగశాలలో జరగాల్సిన అంకురార్పణను ఆలయ అర్చకులు నిలిపివేశారు. సంవత్సర కాలంలో జరిగే ఉత్సవాలను ఆలయంలో ఇద్దరు అర్చక స్వాములు నిర్వహించడం సాంప్రదాయం. బ్రహ్మ స్థానంలో ఉన్న ఆలయ అర్చకులు వసంతోత్సవం అంకురార్పణ చేయాల్సి ఉండగా అర్చకుడిని ఆలయ ఈవో రమాదేవి పూజా కార్యక్రమానికి రానివ్వలేదు. ఈ పరిణామం కారణంగా.. ప్రారంభం కావల్సిన అంకురార్పణ చేయకుండా ఆలయ అర్చకులు నిరసన వ్యక్తం చేశారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మార్చి 30 నుంచి ఏప్రిల్​ 12 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ క్రమంలో.. ఈవోకు, అర్చకులకు మధ్య రగడ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని మిథిలాస్టేడియంలో నిర్వహిస్తారు. 7న మహా పట్టాభిషేకం జరుగుతుంది.

మార్చి 30న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఉగాది పండగ రోజున ఉత్సవారంభం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, ఏప్రిల్​2న గరుడపట లేఖనం, 3న భద్రక మండల లేఖనం, గరుడ పతావిష్కరణ, గరుడాధివాసం, 4న అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, చతుస్థానార్చన, భేరీపూజ, దేవతాహ్వానం, బలిహరణం, 5న ఎదుర్కోలు ఉత్సవం, 6న శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, సాయంత్రం శ్రీరామపునర్వసు దీక్షలు ప్రారంభం అవుతాయి.

ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, రాత్రి రథోత్సవం,8న కల్యాణరాముడికి వేదపండితులతో మహదాశ్వీరచనం, 9న తెప్పోత్సవం, చోరోత్సవం,10న ఉంజల్​సేవ, 11న వసంతోత్సవం, 12న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు, శ్రీపుష్పయాగం, బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి30 నుంచి ఏప్రిల్ 12 వరకు స్వామి వారికి నిత్య కల్యాణాలు, దర్బారు సేవలు రద్దు చేశారు.