- బ్రహ్మోత్సవాల్లో పోటీలను ఆపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు ఫిర్యాదు
- 144 సెక్షన్ విధించిన పోలీసులు
గద్వాల, వెలుగు: గద్వాలలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (మల్దకల్ తిమ్మప్ప స్వామి) బ్రహ్మోత్సవాల్లో రాజకీయ రచ్చతో వివాదం నెలకొంది. మొన్న జరిగిన కల్యాణోత్సవంలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే దంపతులు, కాంగ్రెస్ తరపున జడ్పీ చైర్పర్సన్ సరిత దంపతులు వేర్వేరుగా పట్టు వస్త్రాలు సమర్పించడం చర్చనీయాంశంగా మారగా.. గురువారం నిర్వహించ తలపెట్టిన బండలాగడు పోటీలు ఉద్రిక్తతకు దారి తీశాయి.
బండలాగుడు పోటీలు నిర్వహించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీలు ఏర్పాటు చేయకూడదంటూ.. కలెక్టర్ కు, ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ కు, ఐజీ, డీఐజీలకు ఫిర్యాదు చేశారు. దీంతో పోటీలో నిర్వహించకూడదంటూ ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేసి 144 సెక్షన్ పెట్టాలని ఆదేశించారు.
ఎస్పీ రితిరాజ్ బుధవారం రాత్రి మల్దకల్ బండలాగుడు పోటీలు జరుగుతున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆనవాయితీగా వస్తున్న బండలాగు పోటీలను నిర్వహించకుండా బీఆర్ఎస్ లీడర్లు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మండిపడ్డారు. గురువారం ఉదయమే పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ లీడర్లు రాస్తారోకో చేశారు.
ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు
బండలాగుడు పోటీల నిర్వహణకు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. బ్రహ్మోత్సవాలలో ఈసారి బండలాగు పోటీలకు బ్యాన్ పెట్టడం జరిగింది. పర్మిషన్ లేకుండా ఎవరైనా బండలాగు పోటీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తాము. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాం. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు అందరూ సహకరించాలి.
వెంకటేశ్వర్లు, డీఎస్పీ గద్వాల