
లింగంపేట, వెలుగు : అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం లింగంపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తొల గించడంతో వివాదం రేగింది. మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నీరడి సంగమేశ్వర్ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఫొటో ఉండడంతో ఫ్లెక్సీని తొలగించాలని పంచాయతీ సెక్రటరీ శ్రావణ్ కుమార్‌కు కాంగ్రెస్ దళిత నాయకులు సూచించారు. సెక్రటరీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఎస్సై వెంకట్రావు, ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్ అక్కడికి చేరుకుని పంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలను తొలగించారు.
ఫ్లెక్సీ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ దళిత సంఘం నాయకులు ఆందోళన దిగగా, మాజీ ఎమ్మెల్యే సురేందర్ అక్కడకు చేరుకుని మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీసత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనను విరమింపజేశారు.
దళితులను అవమానించడమే ప్రజా పాలన ?: ఎమ్మెల్సీ కవిత
కామారెడ్డి, వెలుగు : అంబేడ్కర్ జయంతి రోజున దళితులపై కర్కశత్వంగా వ్యవహరించమే కాకుండా, దళితులను అవమానించటమే ప్రజా పాలనా..? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేపిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బట్టలు విప్పి దళితులను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అని ప్రశ్నించారు.