కేసీఆర్​ పండరీపూర్​ టూర్​లో మటన్​కర్రీ పంచాదీ

పండరీపూర్: బీఆర్​ఎస్​ చీఫ్​, సీఎం కేసీఆర్​ మహారాష్ట్ర టూర్​లో వంటకాలు వివాదానికి దారితీశాయి. పండరీపూర్ వెళ్లిన కేసీఆర్​తో పాటు మంత్రులు, పార్టీ కార్యకర్తలకు లోకల్ లీడర్లు భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా పండరీపూర్​కు చేరుకోగానే ధరాశివ్‌లోని ఉమర్గా వద్ద సీఎం కాన్వాయ్ ఆగింది. అక్కడ భోజనం చేశాక.. పాండురంగ స్వామిని దర్శించుకున్నారు. అయితే.. సీఎం మటన్ తిని స్వామి వారిని దర్శించుకున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భక్తుల మనోభావాలను బీఆర్​ఎస్​ నేతలు దెబ్బతీశారని లోకల్ మీడియా చానళ్లలో కథనాలు వచ్చాయి.  మటన్, చికెన్​ వంటకాల వీడియోలు, బీఆర్​ఎస్​ లీడర్ల భోజనం వీడియోలను ప్రసారం చేశాయి. కాంగ్రెస్ పార్టీ లీడర్ అమూల్ మిత్కరీ మాట్లాడుతూ..‘‘నాన్​వెజ్​ తిని పండరీపూర్ టెంపుల్​లోకి వెళ్లడం ఏమిటి?  భక్తుల భావోద్వేగాలతో ఆటలాడొద్దు. పండరీపూర్​కు వచ్చే ముందు పదివేల సార్లు ఆలోచించండి. పాండురంగడి పవిత్రతను నీ ప్రవర్తనతో దెబ్బతీయకు” అని కేసీఆర్​పై ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర సంప్రదాయానికి ఓ చరిత్ర ఉందని.. మటన్, మందుతో దాన్ని చెడగొట్టద్దని సూచించారు. ఇలాంటి వాళ్లను ప్రతి ఒక్కరూ నిలదీయాలని ఆయన అన్నారు. 

ALSO READ:సీఎం కేసీఆర్ కు పొన్నం ప్రభాకర్ సవాల్ 

ఆలయ పవిత్రతను దెబ్బతీయొద్దు: రాందాస్​ అథవాలే

పండరీపూర్ పవిత్రతను దెబ్బతీయొద్దని కేసీఆర్​కు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సూచించారు. ‘‘మహారాష్ట్ర మటన్ అంతగా నచ్చితే తెలంగాణకు తీసుకెళ్లి తినాలి. లక్షలాది మంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి పండరీనాథుడిని దర్శించుకుంటారు. మటన్ తిని ఆలయంలోకి వెళ్లడం సరికాదు. అది కూడా ఆషాఢ మాసంలో క్షమించరాని నేరం. దేవుడే కేసీఆర్​కు బుద్ధి చెబుతాడు” అని ఆయన మీడియాతో అన్నారు.